Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కలను, లారీని పోలీసులకు అప్పగించిన రైతులు
నవతెలంగాణ-దమ్మపేట
తెలంగాణ ప్రభుత్వం రాయతీ ఇస్తున్న పామాయిల్ మొక్కలను కొంత మంది దళారులు ఆంధ్రాలో ఒక్కో మొక్క రూ.3 వందలకు పైచిలుకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో జనగాంలోని టీఎస్ఆయిల్ఫెడ్ నర్సరీ నుంచి ఆంధ్రాలోని జంగారెడ్డిగూడెంకు లారీలో తరలిస్తున్న 750 మొక్కలతో పాటు లారీని రైతులు ఆదివారం తెల్లవారుజామున అడ్డుకుని దమ్మపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుతో పాటు అప్పగించారు. ఫిర్యాదు చేసిన రైతులు తుంబూరు ఉమామహేశ్వరరెడ్డి, ఆళ్ల నాగేశ్వరరావు, వెంపటి లక్ష్మినారాయణలు తెలిపిన వివరాలు... జనగాంలోని ఆయిల్‌ఫెడ్ నర్సరీ నుంచి ఆంధ్రాకు మొక్కలు అక్రమంగా రవాణ జరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. లారీలోని 750 మొక్కల్లో 4వందల మొక్కలు వేంసూరు మండలంలోని కందుకూరు గ్రామంలోని ఒక వ్యక్తి పేరుతోను, మిగిలిన 350 మొక్కలు పేరు లేకుండా సత్తుపల్లి పేరుతో డెలివరీ చెలానా రాసి తరలిస్తున్నారు. లారీ కందుకూరుకు వెళ్లే దారులతో పాటు సత్తుపల్లిని దాటి దమ్మపేట మండలంలోనికి ప్రవేశించిన తరువాత పట్టుకున్నారు. లారీ డ్రయివర్ను, లారీని వెనక వస్తున్న ఆంధ్రాకు చెందిన వ్యక్తులను నిలదీయగా జనగాంలోని పామాయిల్ నర్సరీ నుంచి జంగారెడ్డిగూడెంకు మొక్కలు తీసుకెళ్తునట్లు అంగీకరించారని రైతులు విలేకర్లకు వివరించారు. ఒక్కో మొక్కను రూ.3వందలకు సత్తుపల్లి శివారు సిద్దారం గ్రామానికి చెందిన వ్యక్తి ద్వారా కొను గోలు చేసామని కారులోని వ్యక్తులు చెప్పినట్టు ఆరైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. లారీని దమ్మపేట పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణలో లారీని సత్తుపల్లి మండల పరిధిలోనే ఫిర్యాదు చేసిన రైతులు అడ్డుకున్నట్లు చెప్పడంతో సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌కు మొక్కల లారీని దమ్మపేట పోలీసులు తరలించారు. తెలంగాణాలో ఆయిల్‌ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.20కే పామాయిల్ మొక్కలను రైతులకు అందచేస్తుంది. ఆంధ్రాల్లో రాయతీ ఇవ్వకపోవడంతో పాటు డిమాండ్ అధికంగా వుంది. దీనిని అవకాశంగా తీసుకున్న కొంతమంది దళారులు అక్రమాలకు పాల్పడుతున్నారు.
డెలివరీ చెలానా నకిలీది
ఆంధ్రాకు తరలుతున్న మొక్కల విషయంపై ఆయిల్‌ఫెడ్ డివిజన్ మేనేజర్ బాలక్రిష్ణను వివరణ కోరగా డెలివరీ చెలానా నకిలీదని స్పష్టం చేసారు. సదురు డీఓ తాము ఇవ్వలేదన్నారు. అక్రమాలకు పాల్పడినవారిపై జనగాం పోలీసులకు ఫిర్యాదు చేసామన్నారు.
- ఆయిల్‌ఫెడ్ డివిజన్ మేనేజర్ బాలక్రిష్ణ