Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హక్కు పత్రాలు ఇవ్వకుంటే ప్రజాప్రతినిధులు, అధికారులను గ్రామ సభలో అడ్డుకుంటాం
- వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్
- విజయవంతంగా ముగిసిన వ్యకాస జిల్లా 3వ మహాసభలు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దేశ వ్యాప్తంగా 11లక్షల 78వేల పోడు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలంగాణ రాష్ట్రంలో 18లక్షల 3252 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా వీటిలో 4 లక్షల 29వేల 971 ఎకరాలు పేదల అధీనంలో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని వీరందరికీ ప్రభుత్వం హక్కు పత్రాలు ఇవ్వాలని లేని ఏడల తెలంగాణ వ్యవశాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులను, అధికారులను గ్రామాలలో తిరగకుండా అడ్డుకుంటామని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలు బుర్రి ప్రసాద్ హెచ్చరించారు. వ్యకాస జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, ఆహాన సంఘం అధ్యక్షులు మాజీ డీసీసీబీ చైర్మన్ యలమంచి రవికుమార్ అధ్యక్షతన జరుగుతున్న సంఘం జిల్లా 3వ మహాసభలు రెండవ రోజు విజయవంతంగా ముగిసాయి. ఈ సందర్బంగా బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ... సాగులో ఉన్న భూముకు హక్కు పత్రాలతో పాటు, రైతు బంధు అమలు చేయాలని, బ్యాంకు రుణాలు తక్షణమే ఇచ్చే విధంగా ప్రభుత్వం అధికారులకు దిశా, నిర్దేశం చేయాలని అయన డిమాండ్ చేశారు. రెవెన్యూ, ఫారెస్ట్ సరిహద్దుల మధ్య ఉన్న భూముల సమస్యలు పరిష్కారానికి రెవెన్యూ, ఫారెస్ట్ అధికారుల జాయింట్ సర్వే నిర్వహించి సెంటిల్ మెంట్ చేయాలన్నారు. సుప్రీం కోర్టులో ఉన్న పిటిషన్ లను పరిష్కరించి ప్రభుత్వం కోర్టును అప్పీలు చేసి గ్రామ సభ తీర్మానం ఆధారంగా సాగుదారులను గుర్తించాలి తప్ప అధికారుల తీర్మాణాల ద్వారా గుర్తించే చర్యలు ఆపాలి అన్నారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పేదలకు పంచాలని లేకుంటే ఇండ్లను ఆక్రమిస్తామన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా కనీసవేతన జీవోను సవరించి రోజు కూలి రూ.600 ప్రకటిస్తూ జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేరళ వామపక్ష ప్రభుత్వం మాదిరి పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనిని పెట్టేందుకు రాష్ట్ర బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ఆధారంగా నష్ట పరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శి జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బి.చిరంజీవి, నిమ్మల వెంకన్న, శెట్టి వినోద, ముదిగొండ రాంబాబు, బత్తుల వెంకటేశ్వర్లు, మర్మం చంద్రయ్య, యాసా నరేష్, వీర్ల రమేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచి వంశీకృష్ణ, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కారం పుల్లయ్య, సరియం కోటేశ్వరరావు, సరియం రాజమ్మ, చిలకమ్మ, తదితరులు పాల్గొన్నారు.