Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాసభల విజయవంతానికి కృషి చేసిన వారికి ధన్యవాదములు
- విలేకర్ల సమావేశంలో వ్యకాస అధ్యక్ష, కార్యదర్శులు
నవతెలంగాణ-కొత్తగూడెం
వ్యవసాయ కూలిరేట్లు, భూ పోరాటాలు ఉధృతం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మచ్చా వెంకటేశ్వర్లు, రేపాకుల శ్రీనివాస్‌లు స్పష్టం చేశారు. సోమవారం మంచి కంటి భవన్లో ఏర్పాలు చేసిన విలేకర్ల సమావేశంలో వ్యకాస నూతన అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యాక్షులు మహాసభ వివరాలు, తీర్మాణాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెంలో ఈ నెల 26, 27 రెండు రోజుల పాటు ఉత్సాహపూరితంగా మహాసభలు జరిగాయని చెప్పారు. మహాసభల జయప్రదం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు, సహకరించిన శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్యలు మాట్లాడారు. పోడు భూములకు హక్కు పత్రాలు వెంటనే ఇవ్వాలని, సర్వే చేయకుండా నిలిపిన భూముల సర్వే వెంటనే చేయాలని, గ్రామ సభలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. పోడు సాగుదారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలన్నారు. వ్యవసాయ కార్మికుల కూలి రేట్లు పెంచుతూ కొత్త జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలన్నారు. ఉఫాది హామీకి బడ్జెట్లో నిధులు పెంచాలన్నారు.
పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు కల్పించాలన్నారు. ఆదివాసీయలకు రెండవ పంటగా ఉన్న తునికాకు రేటు పెంచాలన్నారు. 2016 సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న తునికాకు బోనస్ చెల్లించాలి కట్టరేటు రూ.5లు పెంచాలన్నారు. పేదలందరికీ ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితబందు అందరికీ అందజేయాలని, ఖమ్మంలో డిసెంబర్ 29, 30, 31తేదీలలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని, ఈ మహాసభలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. డిసెంబర్ 29న బహిరంగ సభకు 30వేల మంది ప్రజలను సమీకరిస్తామని వారు తెలిపారు. వలస ఆదివాసీలను వెళ్ళగొట్టాలని మంత్రి అనడం సరికాదన్నారు. హత్య చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. చట్టానికి లోబడి ఉండే ఆదివాసీలను బహిష్కరించాలనే తీర్మానం కూడా కరెక్ట్ కాదన్నారు.
మహాసభలో నూతన కమిటీ ఎన్నిక...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ మహాసభలలో సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్, భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబూరావులు పాల్గొన్నారని తెలిపారు. నూతన జిల్లా కమిటీ సభ్యులుగా 38 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. అధ్యక్షులుగా మచ్చా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా రేపాకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా అన్నవరపు కనకయ్యలు, బి.చిరంజీవి (అశ్వారావుపేట), బత్తుల వెంకటేశ్వర్లు (భూర్గంపాడు), ముదిగొండ రాంబాబు (ములకలపల్లి), శెట్టి వినోద (పాల్వంచ), ఆలేటి కిరణ్ (ఇల్లందు), గడ్డం స్వామి (భద్రాచలం), మర్మం చంద్రయ్య (దుమ్ముగూడెం), నిమ్మల వెంకన్న (పినపాక)లతో పాటు మొత్తం 38మందితో జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ మహాసభలో ఆమోదించిన తీర్మానాలు వివరించారు.