Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఏజీఎస్ జిల్లా నాయకులు మడివి రమేష్
నవతెలంగాణ-పినపాక
చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామపంచాయతీ ఎర్రబోడు గ్రామానికి చెందిన 40 గొత్తి కోయల కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేస్తున్నట్లు గ్రామసభ తీర్మానం చేయడాన్ని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘంగా ఖండిస్తున్నామని సంఘం జిల్లా నాయకులు మడివి రమేష్ తెలిపారు. సోమవారం పినపాక మండలం జనంపేటలో మండల అధ్యక్షులు దుబ్బా గోవర్ధన్ ఆధ్వర్యంలో సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మరణానికి కారకులైన వారి పైన చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే సందర్భంలో రాజ్యాంగం కల్పించిన ఐదవ షెడ్యూల్లోని ఆదివాసి తెగలను బహిష్కరించే హక్కు ఎవరికీ లేదని తక్షణమే గ్రామ సభ తీర్మానాన్ని రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర మంత్రి గొత్తి కోయలను ఇక్కడ రాష్ట్రం వాళ్ళు కాదని పేర్కొనడం సరికాదని అన్నారు. వలస ఆదివాసీలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా అన్ని గుర్తింపులు ఉన్నాయని రాష్ట్ర మంత్రి ఈ రకమైన ప్రకటన చేయడం సమస్య పరిష్కారం కాకుండా చేయడమేనని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, ఈసం భవతి, తదితరులు పాల్గొన్నారు.