Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వలస ఆదివాసీలపై బహిష్కరణ, నిర్భాందాన్ని నిలుపుదల చేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-మణుగూరు
ఫారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాసరావు హత్యను సీపీఐ(ఎం) ఖండిస్తున్నదని, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. సోమవారం స్థానిక శ్రామిక భవనంలో నియోజకవర్గస్థాయి జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫారెస్ట్ అధికారిని అడ్డు పెట్టుకోని వలస ఆదివాసీలపై బహిష్కరణ, నిర్భాందాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎర్రబోడు గ్రామస్తులను నివాస స్థలాలను వదిలి వెళ్లిపోవాలని పంచాయతీ అధికారులు తీర్మానించడం, అటవిశాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమన్నారు. ఒకరిద్దరు హత్య చేస్తే 22 ఏండ్లుగా చెట్టు, పుట్ట పట్టుకోని జీవనం కొనసాగిస్తున్న ఆదివాసులందరినీ నేరస్తులుగా భావించరాదన్నారు. ఆర్టికల్ 9 ప్రకారం భారత పౌరులు ఎక్కడైన జీవించవచ్చన్నారు. ఛత్తిస్ఘడ్ రాష్ట్రంలో గిరిజనులు భౌతిక పరిస్థితులు సరిగ్గాలేక బతకడం కోసం ఈ ప్రాంతానికి వలస వచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచినీరు, విద్యుత్, రేషన్‌కార్డులు, ధృవపత్రాలు, ఆధార్‌కార్డులు, రోడ్లు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినా గ్రామాల నుంచి బహిష్కరించడం సరికాదన్నారు. ఎర్రబోడు గ్రామంలో అనేక సార్లు ఫారెస్ట్ అధికారులు దాడులు చేశారన్నారు. వలస ఆదివాసుల పోడు భూములను లాగేసుకున్నారన్నారు. ఏనాడు వలస ఆదివాసులు తిరుగుబాటు చేయలేదన్నారు. ఒకరిద్దరు దుశ్చర్యల కారణంగా జరిగిన సంఘటన జిల్లా వ్యాప్తంగా వలస ఆదివాసులపై దౌర్జన్యం చేయడం సరి కాదన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యావతి రాథోడ్ వలస ఆదివాసులను తెలంగాణలో జీవించే హక్కు లేదని పత్రిక ప్రకటించడం సరైంది కాదన్నారు. దీని కారణంగా వలస ఆదివాసులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. స్థానిక గిరిజనులకు, ఆదివాసుల మధ్య మనస్పర్దలు పెరిగాయన్నారు. ఇటీవల కాలంలో నిర్వహిస్తున్న సర్వేలు సభలు చర్చనీయాంశంగా మారాయన్నారు. 2021లో దరఖాస్తు చేసుకున్న పోడుసాగుదారులకు సర్వేలు సభలు నిర్వహి స్తున్నారు. వాటిని పక్కదారి పట్టిస్తూ కుట్రపూ రితంగా సర్వే చేస్తున్నారన్నారు. సర్వేలను, సభలను పారదర్శకంగా నిర్వహించాలని ఆయన డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కొడిశాల రాములు, సీపీఐ(ఎం) సీనీయర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, మడి నర్సింహారావు, నందం ఈశ్వరరావు, ఉత్తమ్, పిట్టల నాగమణి, తోట పద్మ, వైనాల నాగలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.