Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్లో ఉన్న 21 నెల వేతనాలు చెల్లించాలి
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మచారి
- విప్ రేగా, కలెక్టర్, ఎమ్మెల్సీ తాతా మధులకు వినతి
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ వర్కర్ల పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి అన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీ వేస్ వర్కర్ల అందరినీ పర్మినెంట్ చేయాలని, వర్కర్లను పర్మినెంట్ చేయడానికి అడ్డుగా ఉన్న జీవో నెంబర్ 212ను సవరించాలని, కళాశాల హాస్టల్స్లో పనిచేస్తున్న వర్కర్లకు రావలసిన 21 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ సీఐటీయూ అనుబంధ హాస్టల్ డైలీ వేజ్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు కిన్నెరసాలలో క్రీడా పోటీల ప్రారంభానికి హాజరైన విప్ రేగా కాంతారావు, కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్సీ తాత మధులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కే.బ్రహ్మచారి మాట్లాడుతూ ప్రభుత్వం హాస్టల్ వర్కర్లతో చాకిరి చేయించుకుంటుందని విమర్శించారు. నెలల తరబడి వేతనాలు రాకపోతే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, అధికారులు జీతాలు లేకుండా పనులు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కార్మికుల వారసులకు డైలీ వేజ్ వర్కర్లుగా ఉద్యోగం ఇవ్వాలని కోరారు. పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్మికుల డిమాండ్లను పరిష్కారం చేయకపోతే నవంబర్ 1 తరువాత విధులు బహిష్కరిస్తామని పేర్కొన్నారు. వినతి పత్రాన్ని తీసుకున్న రేగా కాంతారావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడి బకాయి వేతనాలు చెల్లించే విధంగా కృషి చేస్తానన్నారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ మీ సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో మాట్లాడుతున్నానని, సాధ్యమైనంత తొందరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని, బకాయి వేతనాలు విడుదల కోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వితని పత్రం అందజేసిన వారిలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కే.సత్య, హాస్టల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, కోశాధికారి ఈసం పద్మ, జిల్లా నాయకులు జలంధర్, స్వరూప, భద్రమ్మ, తిరుపతమ్మ, లాలయ్య, స్వామి, కనప్పరాజు తదితరులు పాల్గొన్నారు.