Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులపై పని భారాన్ని, మానసిక ఒత్తిడిని తగ్గించాలి
- సీఐటీయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ డిమాండ్
నవతెలంగాణ-భద్రాచలం
తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా విధించిన ఆంక్షలు రద్దు చేయాలని, కార్మిక సంఘాల కార్యక్రమాల నిర్వహణకు అనుమతివ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మచారి, ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజియన్ కార్యదర్శి లింగమూర్తి డిమాండ్ చేశారు. ఎస్డబ్ల్యుఎఫ్ భద్రాచలం డిపో పదో మహాసభలో వారు పాల్గొని మాట్లాడారు. కిలోమీటర్ల సంఖ్యను పెంచి కార్మికులపై తీవ్రమైన పని భారాన్ని పెంచుతున్నారని, మానసిక ఒత్తిడి పెరిగి అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేకుండా ఆంక్షలు విధించడం ప్రభుత్వమే రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయటం కిందికి వస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం బకాయిపడిన రూ.850 కోట్ల సీసీఎస్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఐక్యంగా పట్టుదలతో పోరాడాలని సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 మోటార్ వెహికల్ చట్టం ప్రజా రవాణా వ్యవస్థకు ఉరితాడు లాంటిదని పేర్కొన్నారు. మోటార్ వెహికల్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులను కట్టు బానిసలుగా మార్చుతాయని, ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని లాభాల బాటలో తేవాలి అంటే ప్రభుత్వం ఆర్టీసీకి బడ్జెట్లో రాయితీలు కల్పించాలన్నారు. ఈ మహాసభలో ఎస్డబ్ల్యుఎఫ్ సీనియర్ నేత ఎం.ఎన్.రెడ్డి, రీజియన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడారు. మహాసభకు డిపో కమిటీ అధ్యక్షులు రమేష్ అధ్యక్షత వహించగా సీఐటీయూ పట్టణ కన్వీనర్ వెంకట రామారావు, ఎస్‌డబ్ల్యూఎఫ్ సీనియర్ నాయకులు ఎం.వి.ఎస్.ఎస్.నారాయణ, ముత్తయ్య, డిపో కార్యదర్శి ప్రతాప్, నాయకులు కేకే.ప్రసాద్, డీఎన్ రావు, బాలకృష్ణ, నాగమణి, కవిత, దుర్గా చారి, బంగారు రాజు, రామరాజు, కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.