Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కుష్టువ్యాధి నిర్మూలనకు తోడ్పడాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంపై వైద్య, అంగన్వాడీ, విద్యా, ఎస్సీ, బిసి, మైనార్టీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 6 నుండి 22 వ తేదీ వరకు ప్రతి ఇల్లు స్క్రీనింగ్ చేసేందుకు 1440 టీములు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి ఇల్లు స్క్రీనింగ్ చేయాలని చెప్పారు. కుష్ఠువ్యాధి మచ్చల సహజ చర్మపు రంగు కంటే తక్కువ లేదా ఎరుపు లేదా రాగి రంగు కలిగి ఉంటాయని చెప్పారు. మచ్చపై స్పర్శ ఉండదని, నొప్పి ఉండదని, దేహంలో ఏ ప్రదేశంలోనైనా రావొచ్చని చెప్పారు. గుర్తించిన వ్యక్తులకు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా వైద్య సేవలు అందిచడం జరుగుతుందని చెప్పారు. సర్వే నిర్వహణకు వచ్చిన సిబ్బందికి సహాకరించాలని చెప్పారు. డిసెంబర్ 3 నుండి 5వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లో ప్రార్ధనా సమయాల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విద్యా, సంక్షేమ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు నాయక్, సంక్షేమ అధికారి వరలక్ష్మి, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, బిసి సంక్షేమ అధికారి సురేందర్, అదనపు వైద్యాధికారులు డాక్టర్ శిరీష, శ్రీనివాసరావు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుజాత, డాక్టర్ చేతన్, డాక్టర్ నాగేంద్రప్రసాద్, సిడిపిఓలు తదితరులు పాల్గొన్నారు.