Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు బృందానికి విన్నవించిన పీవో
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసి గిరిజన కుటుంబాలకు, గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల చదువు కోసం, అలాగే వారికి వైద్యం పరంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవనోపాధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతం పొట్రు తమిళనాడు నుంచి వచ్చిన బృందానికి తెలియజేశారు. మంగళవారం తన చాంబర్లో ఐటీడీఏ ద్వారా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు వారి కోసం తీసుకుంటున్న అనేక రకాల సౌకర్యాలపై రీసెర్చ్ చేయడానికి వచ్చిన బృందంతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడారు. అనంతరం తమిళనాడు నుండి వచ్చిన ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ అన్న దొరై మాట్లాడుతూ ఇక్కడ ఐటీడీఏ ద్వారా గిరిజనుల కోసం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలను మా రాష్ట్రంలో ఉన్న గిరిజనులకు ప్రవేశపెట్టి వారి స్వయం ఉపాధి, జీవన భృతి పెంపొందించుకోవడానికి కల్పించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ సురేష్ బాబు, డీఎస్ఓ ప్రభాకర్ రావు, తమిళనాడు నుంచి వచ్చిన బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.