Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషల్ మీడియా వేదికగా పనికిమాలిన పోస్టింగులు
- గతంలో మీరెందుకు చేయలేకపోయారు..?
- అభివృద్ధి చేస్తుంటే మీకు కడుపుబ్బెందుకు
- తప్పుడు పోస్టింగులపై మండిపడ్డ ఎమ్మెల్యే సండ్ర
- రాజీవ్‌నగర్‌లో బస్తీ దవాఖానా ప్రారంభం
నవతెలంగాణ- సత్తుపల్లి
ఎంతో కష్టపడి, హైదరాబాద్‌లో కాళ్లరిగేలా తిరుగుతూ, సంబంధిత మంత్రుల ఆఫీసుల మెట్లు ఎక్కీ దిగుతూ సాధించుకొచ్చిన అభివృద్ధిని రొటీన్‌గా వచ్చేవని కొందరు పనికిమాలిన వ్యక్తులు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని పిచ్చిపిచ్చి రాతలతో పోస్టింగులు పెడుతున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఘాటుగా స్పందించారు. మంగళవారం సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే సండ్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సండ్ర మాట్లాడారు. గతంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి వాళ్ల కండ్లకు కనపడటం లేదా అన్నారు. 1974లో నిర్మాణం జరిగిన సత్తుపల్లి పెద్దాసుపత్రి 50 ఏండ్లు దాటి శిథిలమైతే అప్పుడెక్కడికి పోయారీ నాయకులని, ఆసుపత్రిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారంటూ మండిపడ్డారు. ఇప్పటికే రూ. 58 కోట్లతో సత్తుపల్లిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటు అనేకం చేయడం జరిగిందన్నారు. చిన్నాచితకా ఇంకా మిటిలి ఉంటే అవికూడా త్వరలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. విమర్శించడం చాలా తేలిక, అదే అభివృద్ధిని సాధించడానికి శ్రమ, కృషి ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. అవే వస్తాయిలే అనుకొని మనం కూర్చొంటే అభివృద్ధి మనకు కనుచూపు మేరలో కూడా కనపడదన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఇవ్వనన్ని నిధులు కేసీఆర్, కేటీఆర్ సహకారంతో తీసుకరావడం జరిగిందని ఎమ్మెల్యే సండ్ర స్పష్టం చేశారు.
రూ.35 కోట్లతో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న 100 పడకల ఆసుపత్రి...
1974లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కట్టిన 30 పడకల పెద్దాసుపత్రి 50 ఏండ్లు దాటి శిథిల దశకు వచ్చిన నేపధ్యంలో మంత్రి హరీశ్‌రావు సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి సత్తుపల్లిలో 35 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని సాధించుకోవడం జరిగిందని ఎమ్మెల్యే సండ్ర స్పష్టం చేశారు. ఇప్పుడా ఆసుపత్రి శరవేగంగా నిర్మాణం జరుగుతోందని కొద్దిరోజుల్లోనే నిర్మాణం పూర్తిచేసుకొని ప్రజలకు సేవలందించనుందని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. ఇదేగాక పెనుబల్లి, కల్లూరు ప్రభుత్వాసుపత్రులకు నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. వాటి నిర్మాణాలు కూడా త్వరలో ప్రారంభమవుతాయన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో 22 పల్లె దవాఖానాలు...
సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 22 పల్లె దవాఖానాలు ఏర్పాటవుతున్నాయన్నారు. వాటిలో ఇప్పటికే 18 ఆసుపత్రులు పూర్తిచేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నాయన్నారు. సత్తుపల్లిలో మరో 4 బస్తీ దవాఖానాలు ఏర్పాటవవుతున్నాయన్నారు. వాటిలో రాజీవ్‌నగర్ దవాఖానా ప్రారంభం కాగా హనుమాన్‌నగర్, విరాట్‌నగర్ ఎన్టీఆర్నగర్ దవాఖానాలు అతి త్వరలో ప్రారంభమై ప్రజలకు వైద్య సేవలు అందించనున్నాయని సండ్ర తెలిపారు. రాజీవ్‌నగర్ దవాఖానా ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే తో పాటు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో తలారి సీతారామ్, గంగారం డాక్టర్ చింతా కిరణ్‌కుమార్, డాక్టర్ వీరభద్రం పాల్గొన్నారు.
పట్టణంలో సండ్ర సుడిగాలి పర్యటన...
సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే సండ్ర సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులతో పాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మోటారు సైకిల్‌పై ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, డిప్యూటీ మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, వైస్ ఛైర్మెన్ తోట సుజలారాణి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, కమిషనర్ కోడూరు సుజాత, తహసీల్దారు శ్రీనివాసరావు, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, గ్రాండ్ మౌలాలి, అద్దంకి అనిల్‌కుమార్, రఘు, అమరవరపు విజయనిర్మల, దేవరపల్లి ప్రవీణ్‌కుమార్, నాగుల్‌మీరా, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్కే రఫీ, మల్లూరు అంకమరాజు, నాయకులు నడ్డి ఆనందరావు, కృష్ణారావు, రవీంద్రరెడ్డి, అబ్దుల్లా, వీరిశెట్టి సురేశ్ పాల్గొన్నారు.