Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసులు పెట్టి ఉద్రిక్తతలు పెంచవద్దు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-కారేపల్లి
పోడు ప్లాంటేషన్లో మొక్కలను నరికివేశారంటూ ఫారెస్టు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారేపల్లి పోలీసులు 10 మందిపై కేసునమోదు చేశారు. కేసులు నమోదైన వారిని మంగళవారం కారేపల్లి పోలీసులు స్టేషన్కు తీసుకవచ్చారు. కోయగుంపు, వడ్డెరగుంపు, గుడితండాకు చెందిన ప్లాంటేషన్ నిర్వాసితులకు ఫారెస్టు అధికారులు ప్రత్యామ్నాయ పోడు చూపకపోవటం, ప్లాంటేషన్ పోడును నిర్వాసితుల పేరుతో సర్వే చేయటానికి అధికారులు ససేమిరా అనటంతో ఈనెల 20వ తేదిన కారేపల్లి రేంజ్, ఊట్కూరు నార్ట్బీట్ పరిధి ఎర్రబోడు ప్లాంటేషన్ పోడులో ప్లాంటేషన్ నిర్వాసితులు సాగు ఉపక్రమించారు. దానిలో భాగంగా కొన్ని మొక్కలను ధ్వంసం చేశారు. దానిని అడ్డుకున్న ఫారెస్టు అధికారులు పోడుసాగుదారులు 10 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మండలంలోని పోడు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్ధితి నెలకొనటంతో ఫారెస్టు డివిజనల్ ఆధికారి ప్రకాశరావు సమక్షంలో మండల అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు, పోడుదారులతో చర్చించారు. ప్లాంటేషన్ జోలికి పోడుదారులు రావద్దని, గ్రామసభ తీర్మానంకు అనుగుణంగా సర్వే చేద్దామని, పోడుదారులపై కేసుల విషయం ఆలోచిస్తామని హామీ ఇచ్చారు. అయినా పోడుదారులపై కేసులు నమోదుపై పోడుదారులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేసులు పెట్టి ఉద్రిక్తతలు పెంచవద్దు : సీపీఐ(ఎం)
ప్లాంటేషన్ పోడుదారులపై ఫారెస్టు అధికారులు పెట్టిన కేసులను ఎత్తివేయాలని, కేసులతో ఉద్రిక్తలు పెరుగుతాయని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండెబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర అన్నారు. మంగళవారం విలేకరులతో వారు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పోడు చూపకుండా ఫారెస్టు అధికారులు ఏకపక్షంగా కొందరి పోడును లాక్కొని ప్లాంటేషన్ వేశారన్నారు. ఈనెల 24వ తేదిన జరిగిన గ్రామసభలో పోడుదారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, ప్లాంటేషన్ పోడు నిర్వాసితులకు పోడు హక్కు ఇవ్వాలని తీర్మానం చేశారని గుర్తుచేశారు. దానికి వ్యతిరేకంగా అధికారులు పోడుదారులపై కేసులు పెట్టి రెచ్చగొట్టె చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోడుదారులపై పెట్టిన కేసులను పారెస్టు అధికారులు ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు.