Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య డిమాండ్ చేశారు. బుధవారం ములకపాడు గ్రామంలోని అమరజీవి యలమంచి సీతారామయ్య భవనంలో జరిగిన సిపిఐ(ఎం) ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కారం పుల్లయ్య మాట్లాడుతూ... గోవిందపురం, ములకపాడు, ఆర్లగూడెం, సీతారాంపురం గ్రామాలలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడం వల్ల పరిధిలో ఉన్న రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను పునః ప్రారంభించాలని ఆయన అన్నారు. అదేవిధంగా చిన్న నల్లబల్లి, మారాయిగూడెం, గ్రామాలలో జిసిసి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ ధాన్యం కొనుగోలు చేయడం లేదని వెంటనే ధాన్యం కొనుగోలు చేసే విధంగా జిసిసి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మిగతా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా వెంటనే ప్రారంభించి దళారీల దోపిడీ అరికట్టే విధంగా ప్రభుత్వం అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే గ్రామాలలో రైతులను మోసం చేసి తక్కువ రేట్లకు వెయ్యి రూపాయల నుండి 1300 రూపాయలు క్వింటా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని రెవిన్యూ అధికారులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో సిపిఐ (ఎం) పార్టీ ఆధ్వర్యంలో రైతులందరినీ ఐక్యం చేసి ఆందోళన పోరాటాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులకు ఆయన హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమం సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య, కొర్సా చిలకమ్మ, సరియం రాజమ్మ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి శ్రీనుబాబు,యం డి బేగ్, యాసా శ్రీనివాస్ రెడ్డి, గుడ్ల రామ్మోహన్ రెడ్డి, సోడి శ్రీనివాసరావు, కారం సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.