Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హత కలిగిన వారందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి
- సొంత స్థలం ఉన్న వారందరికీ ఐదు లక్షలు ఇవ్వాలి : పోతినేని, నున్నా
నవతెలంగాణ-ఖమ్మం
అర్హత కలిగిన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో గ్రెయిన్ మార్కెట్ నుండి పాదయాత్ర నిర్వహించారు. తొలుత గ్రెయిన్ మార్కెట్ నుండి ప్రారంభమై గాంధీనగర్, రంగనాయకులు గుట్ట, పంపింగ్ వెల్ రోడ్డు, అభినవ్ స్కూల్, సుందరయ్య నగర్, ఎఫ్సీఐ రోడ్డు, ప్రకాష్ నగర్, బోసు సెంటర్ మీదుగా గ్రెయిన్ మార్కెట్ వద్ద పాదయాత్ర ముగిసింది. సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాస్‌రావు అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో నున్నా మాట్లాడుతూ కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పుడు అర్హత కలిగిన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేశారని, అలాగే గత ఎన్నికల ముందు సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారని, కానీ ఇప్పుడు మూడు లక్షల మాత్రమే ఇస్తామని ప్రకటన చేయడం బాగాలేదన్నారు. వాగ్దానం చేసిన ప్రకారం ఐదు లక్షల రూపాయలను తప్పకుండా ఇవ్వాలని, డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలందరికీ ఇవ్వాలని, అలాగే రేషన్ కార్డులు, పెన్షన్లు కూడా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బండారు యాకయ్య, 31వ డివిజన్ కార్పొరేటర్ ఎర్ర గోపి, 3 టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు పత్తిపాక నాగ సులోచన, షేక్ సైదులు, షేక్ హిమామ్, మండల కమిటీ సభ్యులు ఎస్కే బాబు, మద్ది సత్యం, వేల్పుల నాగేశ్వరరావు, పాశం సత్యనారాయణ, సారంగి పాపారావు, పోతురాజు జార్జి, చీకటిమల్ల శ్రీనివాసరావు, షేక్ మస్తాన్ పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం టూ టౌన్ పరిధిలోని రేవతి సెంటర్ నుంచి తమిళ సెంటర్ వరకు పాదయాత్ర కొనసాగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఖమ్మం నియోజకవర్గంలో అర్హత కలిగినవారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు వేల డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఖమ్మం నియోజకవర్గంలో పెండింగ్‌లో వున్నాయని, తెరాసా ప్రజాప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పాలని, సొంత స్థలం వున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ మూడు లక్షలు ఇస్తామని ఒకసారి, ఐదు లక్షలు ఇస్తామని ఒకసారి చెప్పడం తప్ప ఆచరణలో మాత్రం ఇంతవరకు చిల్లిగవ్వ కూడా మంజూరు చేయలేదు అని విమర్శించారు. ఖమ్మం నగరంలో అర్హత కలిగినవారికి పెన్షన్లు ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారని, పెన్షన్లు విషయంలో రాజకీయ నాయకులు తల దూరుస్తున్నారని, రాజకీయాలకు అతీతంగా పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇస్తామని ఇచ్చిన ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు. గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వకుండా ఆన్లైన్ నమోదు పేరుతో కాలయాపన చేస్తున్నారని, వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలపై తెరాసా ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని, సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో నిరంతరం ప్రజాసమస్యలపై దశలవారీగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్ర మంలో నాయకులు పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్, టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, నాయకులు నర్రా రమేష్, ఆర్.ప్రకాష్, ఎండీ గౌస్, సిహెచ్.భద్రం, కె.వెంకన్న, బి.ఉపేంద్ర, జె.వెంకన్నబాబు, ఎన్.కుమారి, హుస్సేన్, వాసు, సూర్యం, రవీంద్ర, జలగం అనిల్ కుమార్, సాయి, కృష్ణవేణి, కనకదుర్గ, మల్లికార్జున్‌రెడ్డి, రాజేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.