Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ- ఖమ్మం
కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టియుసి, ఐయఫ్‌టియు ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి బడ్జెట్ సమావేశాలకు ముందు కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి ఆ చర్చలకు అనుగుణంగా బడ్జెట్‌ని తయారు చేసే సంస్కృతి భారతదేశంలో అనాదిగా వస్తుందన్నారు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరపకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని కార్మికుల హక్కులను హరించి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బడ్జెట్ తయారు చేసే పరిస్థితి నెలకొందని వాపోయారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు, 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను సమూలంగా మార్చి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చినందుకు గాను నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మోడీ నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ఈనెల 2న దేశంలోని అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర సంఘాలు పిలుపు నిచ్చాయన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి కార్మిక సం ఘాలతో భౌతికంగా సమావేశం నిర్వహించకుండా ఆన్లైన్లో సమావేశాన్ని నిర్వహించడం, కార్మిక సమస్యలను వినడానికి కూడా ఆర్థిక శాఖామంత్రి సిద్ధంగా లేకపోవడం, గత దేశవ్యాప్త సమ్మెల్లో కార్మిక సంఘాలు పెట్టిన ఏ ఒక్క డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడం లాంటి అంశాలను నిరసిస్తూ డిసెంబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పటికైనా మోడీ స్పందించి కార్మికుల సమస్యలపై చర్చించి బడ్జెట్ రూపకల్పన చేయాలని లేని వెడల రైతులను ఆదర్శంగా తీసుకొని దేశ యువత పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్ధన్, ఎం.గోపాల్, డి.పూలయ్య, జిల్లా ఉపేందర్, ఏఐటియుసి కార్యదర్శి సింగు నరసింహారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిజీ క్లెమెంట్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాదె లక్ష్మీనారాయణ, తోట రామాంజనేయులు, ఉపాధ్యక్షులు పెరబోయిన మోహన్‌రావు, జిల్లా నాయకులు షేక్ చాంద్ పాషా, రావుల శ్రీనివాస్, మేళ్లచెరువు గురవయ్య, ఐఎన్‌టియూసీ నగర అధ్యక్షుడు నరాల నరేష్ మోహన్ నాయుడు పాల్గొన్నారు.