Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక సంఘాల సమాఖ్య నేతలు
- జిల్లా కేంద్రంలో ప్రదర్శన-కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాన-కొత్తగూడెం
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను ప్రతిఘటించాలని జాతీయ, ప్రాంతీయ కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా నేతలు కార్మిక వర్గానికి పిలుపు నిచ్చారు. దేశవ్యాపిత నిరసన దినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జేఏసి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని అధికారికి అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదాని, అంబానీ లాంటి కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని, ప్రభుత్వరంగంలో నడవాల్సిన సంస్థలను కారుచౌకగా అమ్మకం చేస్తూ దేశ సంపదను దోపిచెడుతున్నారని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని, ఈ చట్టాలను నాలుగు కోడ్లుగా యాజమాన్యాలకు అనుకూలంగా మార్చే చర్యలకు పాల్పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా నాయకులు గుత్తుల సత్యనారాయణ, కంచర్ల జమలయ్య, బండి నాగేశ్వరరావు, గెద్దాడ నగేష్, మాతంగి లింగయ్య, ఏ.లక్ష్మి నారాయణ, రమణయ్య, సిఐటియు జిల్లా నాయకులు కె.బ్రహ్మాచారి, డి.వీరన్న, గాజుల రాజారావు, ఐఎన్‌టియూసీ జిల్లా నాయకులు జలీల్‌పాష, త్యాగరాజు, కాలం నాగభూషణం, అడ్వర్డ్, హెచ్‌ఎంఎస్ జిల్లా నాయకులూ ఆంజనేయులు, ఇఫ్టూ సంఘాల జిల్లా నాయకులు ఎల్.విశ్వనాధం, కందగట్ల సురేందర్, మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గరాశి వెంకటేశ్వర్లు, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి తదితరులు కార్మిక సంఘాల సమాఖ్య నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపి కార్యక్రమంలో పాల్గొన్నారు.