Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవించే హక్కు కాలరాయొద్దు
- పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి
- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్
నవతెలంగాణ-చండ్రుగొండ
ఛత్తీస్‌ఘడ్ నుంచి వలస వచ్చిన ఆదివాసీ గొత్తికోయలు భారతీయులేనని, వారిని బహిష్క రించాలనడం రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం బెండాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రబోడు గ్రామాన్ని ఆయన సందర్శించారు. అక్కడ నివసిస్తున్న ఆదివాసీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఎక్కడైనా నివసించే హక్కు భారత పౌరులకు ఉన్నదన్నారు. నాగరికతకు దూరంగా నివసిస్తున్న ఆదివాసీల విద్య, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వాలు పనిచేయాలని కోరారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు గడిచినా నేటికీ ప్రభుత్వ పాఠశాలలు, విద్యుత్, మంచినీటి సౌకర్యం లేని ఆవాసాలు ఉండటం సిగ్గుచేటన్నారు. ఎర్రబోడు గ్రామానికి విద్యుత్, మంచినీరు, రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారి హత్య చేసిన ఇద్దరు వ్యక్తులను చట్టం శిక్షిస్తుందని, వారి సాకుతో గొత్తి కోయలను వేదించ వద్దన్నారు. వారి హక్కుల కోసం పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు భూక్యా రమేష్, వ్యకాస మండల కార్యదర్శి పెద్దిన్ని వేణు, దాసరి సీతారాములు, చీదర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.