Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మిడియం, నియోజకవర్గ కనీనర్ మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్, దళిత బంధు స్కీంలో ఎమ్మెల్యేలకే సర్వాధికారం అనే నిర్ణయాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మీడియం బాబూరావు, నియోజకవర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వాలు పెట్టే సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందే విధంగా ఉండాలని కోరారు. శుక్రవారం వారు సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే వరకే పరిమితం చేస్తే అదొక రాజకీయ పార్టీకే పరిమితం చేసినట్టుగా అవుతుందని వారన్నారు. ఈ స్కీంలలో రాజకీయ జోక్యం పెరుగుతుందని తద్వారా అర్హత కలిగిన పేదలకు నష్టం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరారు. నియోజకవర్గంలో ఎస్సీలు, ఎస్టీలు అధికంగా ఉన్నారని, అర్హత కలిగినటువంటి పేదలు వేలల్లో ఉన్నారని అటువంటి వారికి ఇంటి స్థలం ఇచ్చి నిర్మాణం వ్యయం రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సొంత స్థలం ఉన్న వారికి రూ.3 లక్షలు ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించడం వలన స్థలం లేని పేదల పరిస్థితి ఏమిటనే ఆందోళన పేదలలో కలుగుతుందని వారన్నారు. స్థలం ఉన్నవారికి కూడా నిర్మాణ వ్యయం అయిదు లక్షలు ఇవ్వాలని, స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలము కేటాయించి నిర్మాణ వ్యయం రూ.5 లక్షల మంజూరు చేయాలని వారు కోరారు.
పోడు భూముల విషయంలో గ్రామసభలలో ప్రభుత్వ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. తాతల కాలం నుండి సాగులో ఉన్న గిరిజన, గిరిజనేతర పేదలకు అర్హత కలిగిన వాళ్లకు అందరికీ హక్కు పత్రాలు ఇచ్చే దిశగా ప్రభుత్వ అధికారులు ప్రయత్నం చేయాలని అన్నారు. పోడు భూముల సమస్యలను సరైన పద్ధతిలో ప్రభుత్వం పరిష్కారం చేయని కారణంగానే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వారన్నారు. ఇటీవల జరిగిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు ఘటన బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోడు భూముల సమస్యను పారదర్శకంగా పరిశీలించి పరిష్కరించాలని కోరారు. భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న పోడు భూముల సమస్యల విషయంలో ప్రభుత్వ అధికారులు కొంత వివక్షను కొనసాగిస్తున్నారని అన్నారు.
గ్రామ సభ తీర్మానం సుదీర్ఘకాలం నుండి వ్యవసాయం చేస్తున్న భూములు, వాటి యోగ్యతని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అలా కాకుండా గూగుల్ మ్యాప్‌ల ద్వారా, సాటిలైట్స్ ద్వారా నిర్ణయాలు చేస్తాము అంటే అసంతృప్తితో ఉన్న గిరిజనులు ఎదురు తిరుగుతారని, అప్పుడు శాంతి భద్రతలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నదని అన్నారు. ప్రభుత్వం సర్వేలు, గ్రామసభలు పారదర్శకంగా నిర్వహించి అర్హులైన వారందరికీ పట్టాలు ఇస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. పోడు భూములను అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని, అవసరమైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులను కూడా పోడు భూముల అభివృద్ధి కోసం ఖర్చు చేయడం ద్వారా పేద గిరిజనులకు న్యాయం చేసినట్లుగా ఉంటుందని వారు కోరారు. కారం పుల్లయ్య అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ సమావేశంలో పై నాయకులతోపాటు ఎం.బి.నర్సారెడ్డి, సరియం కోటేశ్వరావు, సున్నం గంగ, మరం చంద్రయ్య, కొర్శ చిలకమ్మా, సరీయం రాజమ్మ, కారం నరేష్, నకిరేకంటి నాగరాజు, మచ్చ రామారావు, బందెల చంటి తదితరులు పాల్గొన్నారు.