Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేహదారుఢ్య పరీక్షలకు 24733 మంది అభ్యర్థులు
- వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్
నవతెలంగాణ ఖమ్మం
శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. పోలీసు ఉద్యోగార్ధులకు ఈ నెల 8 నుండి దేహదారుఢ్య పరీక్షలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో ట్రైల్ రన్ నిర్వహించారు. ఖమ్మంలో పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించే పరీక్షలకు ఉభయ జిల్లాల నుంచి 24,733 మంది అభ్యర్థులు హాజరవుతారని, వీరిలో పురుషులు 20,033 మంది, మహిళలు 4,700 మంది ఉన్నారని అన్నారు. ముందుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని శివాలయం వద్ద బందోబస్తు విధులలో వున్న పోలీస్ సిబ్బంది అడ్మీట్ కార్డు వున్న అభ్యర్థులను వారికి టోకెన్ నెంబర్ ఇచ్చి పోలీస్ కళ్యాణ మండపంలోనికి అనుమతిస్తారని తెలిపారు. 50 మంది అభ్యర్థులను ఇద్దరు రన్నర్స్ (కానిస్టేబుళ్లు) గ్రౌండ్స్ లో ఏర్పాటు కౌంటర్ల వద్ద తీసుకెళ్తారని తెలిపారు. అభ్యర్థుల డాక్యుమెంట్ పరిశీలన, బయోమెట్రిక్ తర్వాత ప్రతి అభ్యర్థికి చేతికి చీప్ తో కూడిన రిస్ట్ బ్యాండ్, డిజిటల్ చిప్ తో కూడిన ఆర్ఎఫ్ ఐడీ బ్యాండ్స్ అటాచ్ చేస్తారని తెలిపారు. ఆనంతరం పురుషు అభ్యర్థులకు 1,600 మీటర్లు, మహిళ అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు నిర్వహిస్తారని, నిర్ణీత సమయంలో పరుగు పూర్తి చేసిన వారందరికి ''ఎత్తు'' కొలుస్తారని తెలిపారు. నిర్ణీత ఎత్తు ఉన్న వారిని తదుపరి లాంగ్ జంప్, షాట్ పుట్ పోటీలకు అనుమతిస్తారని తెలిపారు. కీలకమైన ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ) ప్రతి ఇవెంట్ లో అర్హత సాధించాలని తెలిపారు. ఇవెంట్ వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణలో వుంటుందని, అదేవిధంగా ఏసీపీ స్ధాయి అధికారిని ఇవెంట్ వద్ద నియమించినట్లు తెలిపారు. మొదటి రోజు ఆరు వందల మంది, రెండవ రోజు 800 వందల మంది, క్రమంగా 13 వందల మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. సమయపాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లాఅండ్ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ప్రసన్న కుమార్, సిసిఎస్ ఏసీపీ రవి, ఆర్ఐలు రవి, శ్రీనివాస్, సాంబశివరావు, తిరుపతి, శ్రీశైలం, సిఐలు చిట్టిబాబు యూనిట్ డాక్టర్ జితేందర్ పాల్గొన్నారు.