Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం ఆంక్షలతో రాష్ట్రానికి రూ.40 వేల కోట్లు నష్టం
- విభజన హామీలు, పెండింగ్ నిధులపై సమగ్రంగా చర్చించాలి
- అఖిల పక్ష సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణా ప్రయోజనాలపై కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అన్ని అంశాలపైనా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సమగ్ర చర్చ జరిపి, తెలంగాణాకు న్యాయం చేయాలని టీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం నుంచి జరగనున్న శీతాకాల సమావేశాలను పురస్కరించుకొని మంగళవారం న్యూఢిల్లీ లో స్పీకర్ ఓం బిర్లా నేతత్వంలో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం లో ఎంపీ నామ టీఆర్ ఎస్ లోక్ సభా పక్ష హౌదాలో హాజరయ్యారు. ఎంపీ నామ మాట్లాడుతూ ఎంతో కాలంగా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అన్ని విభజన అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో ఇంతవరకు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు. పైగా తెలంగాణా ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా కేంద్రం వ్యవహరిస్తుండడం పట్ల మండి పడ్డారు. తెలంగాణా ఆర్థిక మూలాలు దెబ్బతినే విధంగా ఉద్దేశపూర్వకంగా కేంద్రం వ్యవహరించడం పట్ల నామ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లయినా ఏ ఒక్క విభజన హామీ అమలు చేయక పోవడం పట్ల నామ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు తెలంగాణపై ఈ వివక్ష అని ప్రశ్నించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్శిటీ, ఐఐఎం స్థాపన తదితర హామీలు ఏమయ్యాయని ప్రశించారు. వీటన్నింటిపై ఈ సమావేశాల్లో నే చర్చించి, తెలంగాణా కు న్యాయం చేయాలని నామ కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయడం లేదన్నారు. రుణాలు పొందే విషయంలో కూడా లేనిపోని ఆంక్షలు విధించి, వివక్షతే చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపైనా చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రత్యేక చర్చ జరపాలన్నారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యుత్ సంస్కరణలు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, నిరుద్యోగం, కుల గణన, రిజర్వేషన్లు, తదితర అంశాలపై సమగ్రంగా చర్చించాలన్నారు. కేంద్రం కొర్రీలతో తెలంగాణా ఆర్ధికంగా నష్ట పోవాల్సి వస్తుందన్నారు. కేంద్రం మొకాలడ్డడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి రూ.40 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అన్ని అంశాలపైన చర్చించి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని నామ కేంద్రాన్ని కోరారు.