Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేసిన పనుల బిల్లులు చెల్లింపులో జాప్యం
- గాందీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యం
- నవతెలంగాణతో పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలక్ష్మి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గిరిజన మహిళా సర్పంచ్‌గా, విద్యాధికురాలిగా ప్రజలకు సేవా చేయాలనే ఓ మంచి సంకల్పంతో పర్ణశాల సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి తెల్లం వరలక్ష్మి గ్రామ పంచాయతీ ప్రజలకు అందిస్తున్న సేవలను పంచాయతీ ప్రజలు భేష్ అంటూ కొనియాడుతున్నారు. పర్ణశాల అంటే తెలియని వారు ఉండరు. ఇది రాముడు నడయాడిన ప్రదేశంగా వెలుగొందుతోంది. భద్రాచల రామాలయానికి అనుబంధ ఆలయమైన పర్ణశాల రామాలయానికి దేశ నలు మూలలనుండి సీతారామ లక్ష్మణస్వాముల దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడకు వచ్చే భక్తులకు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్యం, మంచినీటి సౌకర్యంతో పాటు కార్తీక పౌర్ణమి, వైకుంఠ ఏకాదశి ముక్కోటి సందర్బంగా గోదావరికి స్నానం ఆచరించడానికి వచ్చే భక్తుల కోసం విద్యుత్ దీపాల ఏర్పాటు వంటివి ఆమె దగ్గర ఉండి పర్యవేక్షిస్తుంటారు. దీంతో పాటు రహదారుల వెంబడి ఏర్పాటు చేసిన మొక్కల పెంపకంపై ప్రత్యేక బాధ్యత తీసుకోవడంతో పాటు దగ్గర ఉండి మరీ పనులు పర్య వేక్షిస్తుంటారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేస్తున్న 7 పల్లె పకృతి వనాలను గ్రామ పంచాయితీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసి వాటిని సుందరంగా తీర్చి దిద్దారు. దీంతో పాటు స్మశాన వాటిక నిర్మాణం, డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి తడి, పొడి చెత్త ఘన వ్యర్దాలను వేరు చేయడం ఎరువుల తయారీ, ప్లాస్టిక్ నిషేధం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పంచాయతీ పరిధిలోని ఆయా గ్రామాలలో 9 సిసి రహదారులను సుమారు 27 లక్షల రూపాయలతో నిర్మించారు. సీతానగరం గ్రామంలో క్రీడా ప్రాంగణం కోసం ప్రభుత్వం కేటాయించిన భూమి వివాదం కావడంతో ఈ విషయాన్ని ఆమె జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ దృష్టికి స్వయంగా తీసుకు వెళ్లారు. పంచాయితీ అభివృద్ధి కోసం పర్ణశాలకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళుతూ సమస్యలు పరిష్కరించడంలో సఫలీకృతురాలు అయిందనే చెప్పవచ్చు..
బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతోంది: పర్ణశాల సర్పంచ్(తెల్లం వరలక్ష్మి) పంచాయతీలో పారిశుధ్య పనుల నిర్వహణ, చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపులో జరుగుతున్న జాప్యం వలన తాము అనుకున్న లక్ష్యంగా దిశగా గ్రామాలను అభివృద్ధి చేయలేక పోతున్నామని ఆమె నవతెలంగాణ ముందు వాపోయారు. చేపట్టిన పనులకు బిల్లులు వెంటనే చెల్లించే విధంగా చర్యలు చేపడితే గాందీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఏర్పాటు తమ వంతు కృషి చేస్తామని ఉన్నతాధికారులు సైతం ఆ దిశగా చర్యలు చేపట్టాలని సర్పంచ్ వరలక్ష్మి కోరుతున్నారు.