Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మణుగూరు : సింగరేణి ఉద్యోగులు శీతాకాలం జాగ్రత్తలు పాటించాలని పికేఓసి ప్రాజెక్టు మేనేజర్ మాలోత్ రాముడు అన్నారు. బుధవారం స్థానిక పైలట్ కాలనీలోని ఓసి4 దుర్గా ఓటి కంపెనీలో జరిగిన కార్మికుల రక్షణ తనిఖీ, అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డిసెంబర్ నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో భారీ యంత్రాలు నడిపే ఆపరేటర్లు, చిన్న తరహా వాహనాలు నడిపే డ్రైవర్లు అన్ని విభాగాల సింగరేణి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అనుక్షణం విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వాతావరణం మార్పుల రీత్యా చలికాలంలో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరు విధి నిర్వహణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని విధులకు హాజరయ్యే ముందు పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించాలని దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. భారీ యంత్రాలు, చిన్న తరహా వాహనాలు నడిపేటప్పుడు ఆపరేటర్లు డ్రైవర్ల సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలన్నారు. తనకు తను నడిపే యంత్రానికి పక్క వారికి కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా స్వీయ రక్షణ పాటించాలన్నారు. రక్షణ విషయంలో రాజీ పడేదే లేదని అధికారులతో పాటు పర్యవేక్షకులు కూడా పూర్తిస్థాయిలో రక్షణ అమలు విషయంలో నిఘా పెట్టాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా సామూహిక రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధికారులు సతీష్, ఉదరు కుమార్,నాసర్ పాషా, దుర్గ సిబ్బంది నాగేశ్వరరావు, ధీరజ్, ఫణి, అవినాష్, తదితరులు పాల్గొన్నారు.