Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్గ సమాజాన్ని పటిష్టం చేయాలి.
- బడాబాబులకు అనుకూలంగా పాలకుల విధానాలు.
- ఎర్రజెండే ప్రజలకు వెలుగు జెండా..
- జనభోజనాల సభలో ఓయూ ప్రొఫెసర్ కాసిం
నవతెలంగాణ-ముదిగొండ
కులాల కుంపటి, మతరక్కసి కోరల్లో భారతదేశ నిర్మాణానికి పాలకులు ఆజ్యం పోస్తు కుల, మత మౌఢ్యాన్ని ప్రజల్లో పెంచి పోషిస్తున్నారని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం అన్నారు. మన ఊరి వన జన భోజనాల సభ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముదిగొండ మామిడితోటలో బుధవారం నిర్వహించారు. ఈసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడాలేని కులం సమాజం భారతదేశంలో నిర్మాణమై ఉందన్నారు. పూర్వకాలంలో ప్రపంచమంతా వర్గ సమాజమే ఆవరించిందన్నారు. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో గతంలో కులాలు లేవన్నారు. కులాలు కుంపటి మధ్యలో వచ్చిందన్నారు. విదేశాలకు వలస వెళ్లిన ప్రతి ఒక్కరూ కుల నిర్మాణాన్ని చేసుకుంటున్నారన్నారు. అమెరికాలో కూడా కులభోజనాలు నిర్వహిస్తున్నారన్నారు. హిందూమతం ఒక నాగుపాము లాంటిదని, అది కోరలతో బుసకొడుతుందన్నారు. మహాత్మ జ్యోతిరావుపూలే, సావిత్రిబాయిపూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొని అసమానతలపై పోరాడి, అంతరాలు లేని సమాజం కోసం కృషి చేశారన్నారు. దోపిడీ, పేదరికం ఉన్నంతవరకు మార్క్సిజం ఉంటుందన్నారు. ఎర్రజెండే ప్రజలకు వెలుగుల జెండాని, సమానత్వం లేకుండా తయారు చేసిన వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు సమానత్వం కోసం పాటు పడాలన్నారు. అనంతరం ప్రొఫెసర్ కాసింను డివైఎఫ్ఐ యువత శాలువతో ఘనంగా సత్కరించారు. కుల రక్కసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రజానాట్యమండలి కళాకారులు సదానందం ఆధ్వర్యంలో ఆటపాట, చిన్నారుల డ్యాన్సులు నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ (ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, ఫిజిక్స్ అధ్యాపకులు బండారు రమేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్కే బషిరుద్దీన్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షకార్యదర్శి బట్టు రాజు, మెట్టెల సతీష్, ఐద్వా అధ్యక్షకార్యదర్శి మందరపు పద్మ, పయ్యావుల ప్రభావతి, రైతు సంఘం మండల అధ్యక్షకార్యదర్శి కందుల భాస్కరరావు, కోలేటి ఉపేందర్, నాయకులు రాయల వెంకటేశ్వర్లు, మందరపు వెంకన్న, వైస్‌ఎంపీపీ మంకెన దామోదర్, ఎంపీటీసీ సభ్యురాలు కోలేటి అరుణ, సిపిఐ (ఎం) నాయకులు మంకెన శేఖర్, టీఎస్ కళ్యాణ్, వేల్పుల భద్రయ్య, ఇరుకు నాగేశ్వరరావు, పి.సుధాకర్, పురిమెట్ల సాయిరాం, కట్టకూరి ఉపేందర్, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కే.సురేష్ తదితరులు పాల్గొన్నారు.