Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు, ఇళ్ల స్థలాల యజమానులకు తీవ్రనష్టం
- ఆర్డీవో ఆఫీస్ ఎదుట కొనసాగుతున్న ధర్నా
నవతెలంగాణ-ఖమ్మం
నాగపూర్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అలైన్మెంట్ మార్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు భాగం హేమంతరావు అన్నారు. గురువారం ఖమ్మం ఆర్డీవో ఆఫీస్ ఎదుట నిర్వాసితులు రెండో రోజు ధర్నా నిర్వహించి ఆర్డిఓ రవీంద్రనాథ్‌కు గ్రీన్‌ఫీల్డ్ హైవే అలైన్‌మెంట్‌పై అభ్యంతరాలు తెలియజేస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాసితుల సంఘం అధ్యక్షులు తక్కలపాటి భద్రయ్య అధ్యక్షతన జరిగిన సభలో పోతినేని సుదర్శన్ రావు, భాగం హేమంతరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఖమ్మం నగర అభివృద్ధికి ఆటంకమైన అలైన్మెంట్ తయారు చేసి రైతులకు, ఇళ్ల స్థలాల యజమానులకు నష్టం చేకూరుస్తుందని, ఖమ్మం నూతన కలెక్టరేట్ భవనం పక్క నుంచి నాగపూర్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం నగర అభివృద్ధికి ఆటంకం అని, కోదాడ-కురివి రోడ్డును అమరావతి హైదరాబాద్ జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, పర్యావరణ అభిప్రాయ సేకరణ సమావేశాల్లో రైతులు, ప్రజలు, రాజకీయ పార్టీలు పాల్గొని నాగపూర్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా ప్రజాభిప్రాయం పర్యావరణంపై వ్యక్తం కాలేదని అధికారులు కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం సరైన కాదన్నారు. ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని నేషనల్ హైవే అథారిటీ తమకు నివేదిక అందినట్లుగా పేర్కొంటుందని, ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు నాగపూర్-అమరావతి ప్రస్తుత అలైన్‌మెంట్‌పై తమ అభిప్రాయాలను బహిరంగ పర్చాలని కోరారు.
కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం నాయకులు ప్రతాపనేని వెంకటేశ్వరరావు, వేములపల్లి సుధీర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, చెరుకుమల్లి కుటుంబరావు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు, నిర్వాసిత రైతు నాయకులు నాగళ్ళ శ్రీధర్, ఎం.రాంబాబు, కే.వెంకటేశ్వరావు, బోజడ్ల వెంకటయ్య, వజ్జా రాధాకష్ణ, మురళి, శ్రీధర్ వేముల, సతీష్, రామారావు, విజరు, పాటి వెంకటయ్య, ప్రతాప్నేని రంగారావు, నిర్వాసిత రైతులు, ఇళ్ల స్థలాల నిర్వాసితులు పాల్గొన్నారు.