Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరించిన వ్యకాస అధ్యక్ష కార్యదర్శులు
నవతెలంగాణ-కొత్తగూడెం
ఈ నెల 29న ఖమ్మంలో జరిగే వ్యవసాయ కూలీల బహిరంగ సభకు వేలాది మంది ప్రజలు తరలి రావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మచ్చ వెంకటేశ్వర్లు, రేపాకుల శ్రీనివాసులు పిలుపు నిచ్చారు. గురువారం మంచికంటి భవన్లో వారు కార్యకర్తలతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభలు ఖమ్మంలో జరుగుతున్నాయని, ముఖ్య అతిథిగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గొంటున్నారని తెలిపారు. దేశంలోనే పేదల సంక్షేమం కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ అని, రేషన్ షాపుల ద్వారా 14 రకాల వస్తువులు పంపిణీ చేస్తూ, పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తు, భూమి పంపిణీ చేస్తూ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం లో వ్యవసాయ కూలి రేట్లు పెంచాలని, పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ఉపాధి హామీ పనులకు బడ్జెట్ లో నిధులు పెంచాలని, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, భూమి లేని పేదలకు సాగు భూములు పంచాలని, డిమాండ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటారకు రూపకల్పన చేయబోతున్నట్లు తెలిపారు. దేశంలో ధనవంతులకు ప్రభుత్వ సంపద పంచడం వల్ల పేదలు మరింత పేదలు గా మారుతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కార్పోరేట్లకు అనుకూల విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం విలయతాండవం చేస్తుందన్నారు. పేదలందరికీ విద్య, ఉపాధి, కోసం పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఉప్పనపల్లి నాగేశ్వరరావు, మహ్మద్ జలాల్, నాగదుర్గ, జబ్బ సంధ్యా రాణి, కంగల రమాదేవి, మెస్సు రామ కోటమ్మ, సతీష్ పాల్గొన్నారు.