Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
చదువుకునే విద్యార్థులకు కడుపునిండా అన్నం వండి పెడుతున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటియు మండల కన్వీనర్ కొర్స చిలకమ్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సీఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలను కోరుతూ తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తాసిల్దార్ ప్రతాప్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ధర్నాను ఉద్దేశించి చిలకమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసినట్టే కోడి గుడ్లను ప్రభుత్వమే పాఠశాలలకు కూడా సరఫరా చేయాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు చెల్లించాలని, నిత్యావసర సరుకులు బిల్లులు సకాలంలో చెల్లించి, పెండింగ్ లో ఉన్న బిల్లులు తక్షణమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాల జీవోని వెంటనే విడుదల చేయాలని మెనూ చార్జీలు పెంచాలని ప్రతి విద్యార్థికి 15 రూపాయలు ఇవ్వాలని కనీస వేతన చట్టం ప్రకారం 26 వేల రూపాయలు ఇవ్వాలని ప్రమాద బీమా ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని రెండు నెలలకోసారి యూనియన్ ప్రతినిధులతో జిల్లా స్థాయిలో డిఇఓ మండల స్థాయిలో ఎంఈఓ లతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించుకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు కే కనకమ్మ, ఎం నరసమ్మ, కే.నరసమ్మ, జి.చెల్లమ్మ, ఎం.సమ్మక్క, టీ.బుల్లెమ్మ, టీ.ముత్యాలక్క, జి.చిన్నక్క, తదితరుల కార్మికులు పాల్గొన్నారు.