Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యమ కార్యచరణ
- 13 నుంచి 16 వరకు ఏఐకేఎస్ 35వ జాతీయ మహాసభలు
నవతెలంగాణ-వైరా టౌన్
దేశ వ్యాప్తంగా రైతులను చైతన్య పరిచి, సమీకరించి సంఘటిత శక్తిగా మార్చడమే అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభల లక్ష్యమని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. ఆదివారం వైరా బోడెపుడి భవనంలో జరిగిన స్టడీ సర్కిల్లో బొంతు రాంబాబు మాట్లాడుతూ రైతాంగం పండించిన పంటలకు చట్టబద్ధమైన మద్దతు ధరలు, కౌలు రైతులు, నిర్వాసితుల సమస్యలపైన దేశవ్యాప్త ఉద్యమం కోసం కార్యాచరణ రూపొందిస్తామని, అఖిల భారత కిసాన్ సభ 35వ జాతీయ మహాసభలు కేరళ రాష్ట్రం త్రిసూర్‌లో డిసెంబర్ 13వ తేదీ నుంచి 16వ తేది వరకు జరుగుతున్నాయని అన్నారు. గతంలో పార్లమెంటులో రైతు కార్మికుల ప్రతినిధులు ఉండేవారని, ప్రస్తుత పార్లమెంటులో కార్పొరేట్ల ప్రతినిధులు మాత్రమే ఉన్నారని, కోట్లాదిమంది జీవన ఆధారమై 60శాతం మందికి దేశియ ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగ సంక్షోభ పరిష్కారానికి పార్లమెంటు చర్చించలేని దుస్థితి ఏర్పడిందని, రైతులు, వ్యవసాయ రంగం సమస్యలను విస్మరించి పాలన కొనసాగించే అవకాశంలేని పరిస్థితికి దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర ఇస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆచరణలో రైతులపైన రెట్టింపు భారం వేసిందని అన్నారు. ఎరువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, విత్తనాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే రైతుల ఆదాయం దారుణంగా పడిపోయిందని అన్నారు. పంటల భీమా పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా అరకొరగా పరిహారం చెల్లించి బలవంత భూసేకరణ చేస్తున్నారని అన్నారు. చట్ట విరుద్ధమైన చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను, నిర్వాసితులను పాలకులు పట్టించుకోవడం లేదని, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 25 వేల కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవేల నిర్మాణం చేయటం దుర్మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో వైరా స్టడీ సర్కిల్ కన్వీనర్ బోడపట్ల రవీందర్, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు బొంతు సమత, సిఐటియు జిల్లా నాయకులు తోట నాగేశ్వరావు, మందడపు రామారావు తదితరులు పాల్గొన్నారు.