Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వం మీద హత్య కేసు నమోదు చేయాలి
- రేగా రెచ్చగొట్టే వాఖ్యలు చేశారు
- విలేకర్ల సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం
నవతెలంగాణ కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం ఎర్రగుడు గ్రామంలో ఇటీవల అటవీశాఖ అధికారి, ఆదివాసుల మధ్య జరిగిన ఘటన గురించి ప్రభుత్వంపై మర్డర్ కేసు నమోదు చేయాలని, పట్టాలు ఇచ్చి ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడుసాగు సమస్యలను పరిష్కరించకుండా తాస్సారం చేయడం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఆదివాసీ ప్రాంతాలలో రిజర్వేషన్లపై గెలిచిన ఆదివాసి ప్రజా ప్రతినిధులు పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించారన్నారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివాసులను రెచ్చగొట్టే విధంగా పోడు సాగు దారుల మీదకు అధికారులు వస్తే కొట్టాలని, తన్నాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని తెలిపారు. ఆయన మాటల వల్లే ఇలాంటి సంఘటనలకు దారి తీసిందని, దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని, ప్రభుత్వంపై హత్య కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివాసీలకు ఇక్కడి నుండి పంపించే అధికారం లేదు. గుత్తికోయలు ఆదివాసీలు కాదని చెప్పడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే మాట్లాడితే ప్రభుత్వంపై ఎట్రాసిటి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీలను రెచ్చగొట్టే విధంగా అటవీ అధికారులు చర్యలుకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.
ఎర్రబోడు గ్రామానికి మౌలిక వసతులు కల్పించాలి
చండ్రుగొండ : ఎర్రబోడు గ్రామానికి మౌలిక వసతులు కల్పించాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాబురావు డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని బెండాలపాడు గ్రామపంచాయతీ శివారు ఎర్రబోడు గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేంజర్ శ్రీనివాసరావు హత్యను ఖండిస్తూ, ఇద్దరు చేసిన తప్పుకు గ్రామాన్ని బహిష్కరించడం గ్రామసభ తీర్మానం చేయడం సరికాదని, అందుకు హైకోర్టు న్యాయబద్ధమైన తీర్పు ఇచ్చిందని, రాజ్యాంగంలో ఆర్టికల్ 342, 5వ షెడ్యూల్ ప్రకారం భారతదేశంలో ఆదివాసీలు ఎక్కడైనా జీవించిన వారిని ఆదివాసీలుగా పరిగణిస్తారన్నారు. ఎర్రబోడు గ్రామానికి చెందిన 8వ తరగతి చదివి మానివేసిన రవ్వ వెంకటరావును విద్యా వాలంటరీగా పని చేయి నేను నెలకు జీతం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, 9 తెగల ఆదివాసీల రాష్ట్ర సమన్వయకర్త చుంచు రామకృష్ణ, ఆదివాసి ఉద్యోగ సంఘాల బాధ్యులు పొడియం బాలరాజు, పెండకట్ల కృష్ణయ్య, బొగ్గం రామనాథం, తోలెం వెంకటేశ్వర్లు, ఆధార్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల పాపయ్య, ఆదివాసి సంఘాల నాయకులు, మల్లం కృష్ణయ్య, కుర్సం సీతారాములు, ధారబోయిన రమేష్, తెల్లం నరసింహారావు, బొర్రా సురేష్, కాకా మహేష్, తదితరులు పాల్గొన్నారు.