Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజనుల భూములను కొనుగోలు చేస్తున్న నర్సరీ యజమానులు
- ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని మట్టి అమ్మకాలు
నవతెలంగాణ-దమ్మపేట
ఏజన్సీ చట్టాలకు తూట్లు పొడిచి కొందరు నర్సరీ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల కొంతమంది గిరిజనుల భూములను కౌలుకు తీసుకుని అందులో సుమారు 20 అడుగుల లోతు వరకు మట్టిని తవ్వి మొక్కల సంచుల్లో నింపి వ్యాపారం సాగిస్తున్నారు. మరి కొంత మంది మరో అడుగు ముందుకేసి అమాయక గిరిజనుల భూముల లక్ష్యంగా చేసుకుని కొనుగోళ్లుకు తెరలేపారు. దమ్మపేట మండలంలో 22 రెవెన్యూ గ్రామాలుండగా దమ్మపేట రెవెన్యూ గ్రామం మినహా మిగిలిన 21 రెవెన్యూ గ్రామాలు ఏజన్సీలోనివే. ఏజన్సీ చట్టమైన 1/70 యాక్టు ప్రకారం భూముల కౌలు, కొనుగోళ్లకు గిరిజనులు మాత్రమే అర్హులు. ఈ చట్టాన్ని అపహాస్యం చేస్తూ పెద్ద ఎత్తున లాభాలర్జిస్తున్న నర్సరీ నిర్వాహకులైన కొంత మంది గిరిజనేతురులు అమాయక గిరిజనుల భూములు కారు చౌకగా కొనుగోలు చేస్తున్నారు. మందలపల్లి, అకినేపల్లి, ముష్టిబండ, పెద్దగొల్లగూడెం, పట్వారిగూడెం, నాచారంతో పాటు మరికొన్ని రెవెన్యూ గ్రామాల్లో వీరు కొనుగోలు చేసిన భూముల్లో మామిడి నర్సరీలు నిర్వహిస్తున్నారు. నర్సరీల సొసైటీ నాయకుడు ముష్టిబండ రెవెన్యూలో సుమారు మూడు ఎకరాలు భూమిని కొనుగోలు చేసాడు. దీని రికార్డును తన పేరు మీదకి మార్చుకోవడానికి మార్గాలను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ భూమిలో నిర్మించిన విశ్రాంతి గృహానికి కరెంటు కనక్షన్ తీసుకునేందుకు ముష్టిబండ పంచాయతీ కార్యాలయంలో చేసుకున్న దరఖాస్తును తిరస్కరించినట్లు సమాచారం. ఈ నాయకుడు గున్నేపల్లి రెవెన్యూ గ్రామంతో పాటు మరికొన్న గ్రామాల్లో సుమారు 30 ఎకరాల్లో నర్సరీని ఏజన్సీ భూముల్లోనే నిర్వహిస్తున్నాడు.
ఔత్సాహిక గిరిజన నిర్వాహకుల నుంచి ఉచిత కరెంటు ఇప్పిస్తామని వసూళ్లు
సొసైటీ నాయకుడు కొత్తగా నర్సరీలు ప్రారంభించిన ఔత్సాహిక గిరిజనుల నుంచి నర్సరీలకు ఉచిత కరెంటు ఇప్పిస్తానని చెప్పి లక్షల్లో వసూళ్లు చేసినట్లు పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక గిరిజన నర్సరీ యజమాని తెలిపాడు. మొదట్లో నాయకుడిని నమ్మి డబ్బులు ఇవ్వకపోవడంతో కరెంటు శాఖలో క్షేత్ర స్థాయి సిబ్బందిని పంపి కరెంటు కనక్షన్లు తప్పించి, స్క్వాడ్‌ను పంపి ఫైన్లు వేయించి వేదించి మరీ సొసైటీ సభ్యత్వం రూ.15 వందలు, డిపాజిట్ రూ.5 వేలు, కార్పస్ ఫండ్ పేరుతో మరో పదివేలు వసూళ్లు చేసాడని వాపోయాడు. ఇలా వసూళ్లు చేసిన డబ్బులకు లెక్కలు చెప్పడం లేదని, లంచాలకు లెక్కలు, రుజువులు వుండవని అంటున్నాడని పలువురు నర్సరీల యజమానులు చెబుతున్నారు. గట్టిగా అడిగిన వారిపై వివిధ శాఖల సిబ్బందితో దాడులు చేయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని మట్టి అమ్మకాలు...
కొంత మంది బహుముఖ కోణాల్లో వ్యాపారాలను చేస్తున్నారు. నర్సరీలు నిర్వహిస్తూనే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అందులోని మట్టిని స్వ యంగా తవ్వి ఉపయోగించుకుంటూనే ఒక్కో ట్రక్కు సుమారు వెయ్యి రూపాయిలకు పైగా తోటి నర్సరీ లకు అమ్ముకుని అర్జిస్తున్నారు. ఇలా ఆక్రమించుకున్న భూమిని కౌలుకు సైతం ఇస్తున్నారు.
చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం : తహసీల్దార్ స్వామి
ఈ ఆరోపణలపై తహాసీల్దార్ స్వామిని స్పందన కోరగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.