Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధులు... బిల్లుల కోసం అధికార విపక్ష సర్పంచ్‌లు నిరసన గళం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయితీలకు నిధులను విడుదల చేయకుండా సర్పంచ్ల జీవితాలతో దోబూచులాడుతున్నారని ప్రభుత్వాల నిరంకుశ పాలనకు చమరగీతం పాడుదామంటూ అధికార, విపక్ష సర్పంచ్‌లు తమ నిరసన గళం విన్పిస్తున్నారు. పాలక ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ ఇదివరకే ఎంపిడిఓకు వినతి పత్రం అందజేయడంతో పాటు ఈ నెల 16వ తేదీన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు ప్రాతినిద్యం వహిస్తున్న తమకు నిధులు అందక అలంకార ప్రాయంగా మారామని వారు విలేకరుల సాక్షిగా వాపోయారు. మండలంలో మొత్తం 37 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 7 సిపిఐ(ఎం) కాంగ్రెస్, ఇండిపండెంట్ సర్పంచ్‌లు ఒక్కొక్కరు ఉన్నారు. మిగతా సర్పంచ్‌లు మొత్తం అధికార పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వలన ప్రతి రోజు ట్రాక్టర్ నిర్వహణ, గ్రామ పంచాయితీ కార్మికులకు వేతనాలు ఇతరత్రా మెయింట్‌నెన్స్ పనులు భారంగా మారాయని వారు ఆవేదన చెందుతున్నారు. గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం అప్పులు చేశామని నేడు చేసిన అప్పులు తీర్చ లేక గ్రామాలలో తిరిగే పరిస్థితి లేదంటూ సర్పంచ్‌లు మక్త ఖరఠంతో కోరుతున్నారు. సర్వ సభ్య సమావేశంలో సర్పంచ్‌లు నిరసన తెలుపుతున్న సమయంలో ఎంపిడిఓ ఎం చంద్రమౌళి తమ పట్ల దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించడంతో పాటు పలు గ్రామ పంచాయితీలలో గత రెండు రోజులు ట్రాక్టర్లు తిప్పకుండా నిలిపివేసినట్లు సమాచారం. ఏది ఏమైనా నిధులు, బిల్లుల మంజూరు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు పార్టీలకు అతీతంగా పాలక ప్రభుత్వాలపై తమ నిరసన గళం విన్పించారనే చెప్పవచ్చు.