Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం, సారపాక పంచాయతీల విభజనను రద్దు చేయాలి
- ఉమ్మడి పంచాయతీకి వెంటనే ఎన్నికలు జరపాలి.
- బంద్ కు సంపూర్ణ మద్దతు
- మణుగూరు, పాల్వంచ మున్సిపల్ ఎన్నికలు జరపాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాచలం, సారపాక పంచాయతీల విభజన రద్దు చేసి మేజర్ పంచాయతీగానే ఎన్నికలు జరపాలని, మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీల ఎన్నికలు వెంటనే జరిపి పాలకవర్గం ఏర్పాటు చేయాలని, సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఆదివారం సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 19న జరిగే భద్రాచలం బంద్కు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రాచలంకు విభజన సమయంలో ఆంధ్రాలో 7మండలాలు కలిపి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. మళ్ళీ ఇప్పుడు 45 జీవో తీసుకువచ్చి భద్రాచలంను మూడు పంచాయితీలుగా విభజించారని దీంతో భద్రాచలం, సారపాకలో పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయని, టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాల్సింది పోయి చిన్న పంచాయితీలుగా విడగొట్టడం సరియైనది కాదన్నారు. అదేవిధంగా మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీల ఎన్నికలు వెంటనే జరిపి పాలకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాలకవర్గం లేకపోవడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి పంచాయతీల విభజన రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఎజే. రమేష్, జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, కొండపల్లి శ్రీధర్, భూక్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు.