Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
అటవీ, రెవిన్యూ భూముల సమస్య పరిష్కారానికి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్య తెలిపారు. ఆదివారం జడ్పీ కార్యాలయంలో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య అధ్యక్షతన అటవి, స్త్రీ, శిశ, వికలాంగుల సంక్షేమ శాఖ, సమీకృత గిరిజ ఇంజనీరింగ్, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అంశాలపై 16వ జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోరం కనకయ్య మాట్లాడారు. అర్హులకు పోడు పట్టాలు జారీపై అటవీశాఖ అధికారులు చెప్పిన అంశాలపై జడ్పిటిసి సభ్యులు సూచనలు పరిగణలోకి తీసుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించు విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పోడు పట్టాలు జారీ చేయు విధంగా అట్టి సమావేశంలో తీర్మానం చేస్తామని ఆయన సూచించారు. 19 మంది జడ్పిటిసి సభ్యులకు రూములు కేటాయించగా లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ జడ్పీటిసి సభ్యులకు ఎందుకు గది కేటాయించలేదని, యంపిడిఓ కార్యాలయాల్లో ప్రత్యేకంగా గదులు కేటాయించు విధంగా చర్యలు తీసుకోవాలని సిఈఓకు సూచించారు. మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించు విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యత కొరవడిందని జడ్పీటిసి సభ్యులు సూచించగా అట్టి అంశాన్ని పరిశీలన చేస్తామని ఛైర్మన్ తెలిపారు. బడిబయట పిల్లలను బడులకు రప్పించు విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కూలీల పిల్లలను బడులల్లో చేర్పించుకోవడం లేదని జడ్పీటిసిలు లేవనెత్తిన అంశాలన్ని పరిగణలోకి తీసుకుని విద్యార్థులకు బడుల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు. బోడు, మర్రిగూడెం రహదారి నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతున్నదని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న ఛైర్మన్ అటవీ అనుమతులు రావాల్సి ఉందని, ఇట్టి అంశమై నివేదిక ప్రభుత్వానికి పంపినట్లు సంబంధిత అధికారులు వివరించారు. గిరిజన ఇంజనీరింగ్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేపట్టిన పనులు నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాల్సి ఉండగా ఎందుకు జాప్యం జరిగిందని, సంబంధిత కాంట్రాక్టరుకు నోటీసులు జారీ చేసి పనులు వేగవంతం చేయు విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గిరిజన భవన్ నిరుపయోగంగా ఉంది...హరిప్రియ, ఇల్లందు ఎమ్మెల్యే
ఇల్లందులో నిర్మించిన గిరిజన భవన్ నిరుపయోగంగా ఉందని వినియోగంలోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఇల్లందు శాసనసభ్యులు హరిప్రియ చెప్పారు. పోడు పట్టాల సమస్య పరిష్కారానికి గ్రామసభలు ద్వారా తీసుకున్న క్లెయిమ్స్ ఎస్ఆర్సి కమిటీలు విచారణ నిర్వహించి గ్రామసభలు పెట్టారని, ఆ సమయంలో కొందరు అందుబాటులో లేమని తమకు ఆన్లైన్ చేయలేదని కోరుతున్నారని అటువంటి వారికి అవకాశం కల్పించు విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కోయగూడెంలో సింగరేణి ఓసి-3 ఏర్పాటుకు సింగరేణి సంస్థ భూములు తీసుకున్నారని, అట్టి భూముల్లోని రైతుల దరఖాస్తులు పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. గ్రామసభలు నిర్వహణ తదుపరి కొదరిలో అపోహలు వస్తున్నాయని, అటువంటి అపోహలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సర్వసభ్య సమావేశంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, జడ్పీ సిఈఓ విద్యాలత, జడ్పీ వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, జడ్పీ డిప్యూటి సిఈఓ నాగలక్ష్మి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.