Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త ఏడాదిలో మీ కోరిక తీరుతుంది
- ఖమ్మంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి రోల్ మోడల్ గా నిలుస్తా
- ఎమ్మెల్యేలతో కూర్చుని అన్ని నియోజకవర్గాల్లోనూ కేటాయింపునకు కృషి
- టీయూడబ్ల్యుజే 3వ మహాసభలో మంత్రి అజయ్
- ఖమ్మం ప్రెస్‌క్లబ్‌కు రూ.40 లక్షల నిధులు ప్రకటించిన ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మంలోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపును నూతన సంవత్సరంలో పూర్తిచేసి విలేకరుల రుణం తీర్చుకుంటానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉద్ఘాటించారు. జిల్లాలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించి జన్మ సార్థకం చేసుకుంటానని ప్రకటించారు. ఆదివారం ఖమ్మంలోని ఎస్సార్ గార్డెన్లో టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ అధ్యక్షతన మూడో మహాసభ జరిగింది. ఈసభలో మంత్రి మాట్లాడుతూ ఖమ్మంలో ఇప్పటికే జర్నలిస్టుల కోసం 100 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణం అవుతున్నాయని, మరో వంద ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. ఖమ్మంలో ఇళ్ల స్థలాలను కేటాయించి రోల్ మోడల్ గా నిలుస్తానని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కూడా ఈ సమస్యను తన సమస్యగా భుజాన వేసుకుని పరిస్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో ఇళ్ల స్థలాల కేటాయింపు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సమక్షంలోనే జరుగుతుందని స్పష్టం చేశారు. టియుడబ్ల్యూజేకు టిఆర్ఎస్తో పేగుబంధం ఉన్నదని మంత్రి అజరుకుమార్ అభివర్ణించారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు సమస్య తీవ్రమైనదని, ఇంకా అనేక సమస్యలను పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన సమస్యగా జర్నలిస్టులు పరిగణిస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపు పెద్ద సమస్య ఏమి కాదని పేర్కొన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరితో ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తే ఈ సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుందని మంత్రి అజరు కుమార్‌కు ఆయన సూచిం చారు. కొత్త సంవత్సరంలో ఇళ్ల స్థలాల కేటాయింపును జర్నలిస్టులకు కానుకగా అందివాలని విజ్ఞప్తి చేశారు.ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ మీడియా మిత్రులు నీతి నిజాయితీలే ఆయుధాలుగా ధరించి ప్రజల పక్షాన నిలవాలని సూచించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ఎలాంటి ఆపదలో ఉన్న ఈ శీనన్న మీ వెంటే ఉంటాడని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి జిల్లా ప్రజా ప్రతినిధులే పరిష్కార మార్గం చూపాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 2000 సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు ఇళ్ల స్థలాల కేటాయింపు జరగలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లా డుతూ జర్నలిస్టు మిత్రులు ప్రజా పక్షాన నిలవాలని సూచించారు.
నూతన ప్రెస్‌క్లబ్ రూ.40 లక్షల నిధులు..
ఖమ్మంలో నూతన ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు విరివిగా తమ నిధులను కేటాయించారు. మంత్రి అజరు కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్సీ తాతా మధులు తలా రూ.10లక్షలు కేటాయించారు. ఈ మహాసభలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఖమ్మం నగర మేయర్ నీరజ సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, టెన్జు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేకల కళ్యాణ్ చక్రవర్తి, రమణ కుమార్, కవిత విద్యాసంస్థల చైర్మన్ పారుపల్లి ఉషా కిరణ్, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, న్యూ డెమోక్రసీ ప్రజాపందా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోటు రంగారావు, యూనియన్ జిల్లా నాయకులు వెన్న బోయిన సాంబశివరావు, బొల్లం శ్రీనివాస్, చిర్రా రవి, ప్రశాంత్ రెడ్డి, రామకష్ణ, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కల్లోజు శ్రీనివాస్, గుద్దేటి రమేష్ బాబు, ఎలమందల జగదీష్, తోట కిరణ్, దానకర్ణ ప్రేమ్ చంద్, వినోద్, రాజేష్, బాలయోగి పాల్గొన్నారు.