Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాదాసీదాగా సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-ఆళ్ళపల్లి (గుండాల)
ప్రభుత్వ డబుల్ బెడ్ రూములు అర్హులైన లబ్ధిదారులకు ఎప్పుడు పంపిణీ చేస్తారని ప్రజా ప్రతినిధులు తహసీల్దార్ నాగదివ్యను ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం గుండాల మండల కేంద్రములోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ముక్తి సత్యం అధ్యక్షతన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ఈ సమావేశానికి మండలంలో 21 శాఖల అధికారులకు గాను 17 శాఖల అధికారులు హాజరయ్యారు. సమావేశాలకు హాజరు కాకుండా మండలంలో అభివృద్ధికి ఏం కృషి చేస్తారని, హాజరు కాని అధికారులపై స్థానిక ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మరణించిన గుండాల ఎంపీటీసీ సంధాని మృతికి సంతాపంగా సభలో మౌనం పాటించి సమావేశం కొనసాగించారు. మండలంలో పలు గ్రామాల్లో భగీరథ నీళ్ల పరిస్థితి ఏమిటని, ఏళ్లు గడుస్తున్నా గ్రామాలకు నీటి సరఫరా కావడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు అడుగగా, కిన్నెరసానిలో పైపులైను కొట్టుకుపోవడం వలన జాప్యం ఏర్పడుతుందని, త్వరలోనే మరమ్మతులు చేపడుతామని అధికారులు తెలిపారు. స్థానిక ఆసుపత్రిలో వైద్యాధికారి లేకపోవడంతో నూతనంగా మరో వైద్యాధికారిని నియమించాలని, సర్వసభ్య సమావేశానికి గైర్హాజరు అయిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. వ్యవసాయ శాఖ, ఈజీఎస్, రెవెన్యూ, విద్య, తదితర శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో ఎస్.వీ.సత్యనారాయణ, ఈఓఆర్డి షేక్ వలీ హజరత్, సర్పంచులు కోరం సీతారాములు, కోడెం ముత్యమాచారి, నర్సింహరావు, జయసుధ, సుధాకర్, ఎంపీటీసీలు క్రిష్ణారావు, క్రిష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.