Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ అంతమే అంతిమ లక్ష్యం
- సీపీఐ ఆవిర్భావ సభలో పువ్వాడ
నవతెలంగాణ- ఖమ్మం
భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వామపక్ష, ప్రజాతంత్ర లౌకిక శక్తుల ఐక్యత అత్యంత అవసరమని, ఆ దిశగా కార్యాచరణ జరగాలని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ శాసనమండలి సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. భారతకమ్యూనిస్టు పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఖమ్మంలో రెడ్‌షర్ట్ వలంటీర్ల కవాత్ నిర్వహించారు. తొలుత పెవిలియన్ గ్రౌండ్ నుంచి మయూరి సెంటర్, జెడ్పీసెంటర్, ఇల్లెందు క్రాస్‌రోడ్, మమత క్రాస్‌రోడ్ మీదుగా ఇందిరానగర్‌కు చేరుకుంది. అనంతరం ఇక్కడ పార్టీ పైలాన్ వద్ద సిపిఐ పతాకాన్ని పువ్వాడ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అధ్యక్షతన సభ జరిగింది. ఈసభలో ఆయన పువ్వాడ మాట్లాడుతూ ఇప్పుడు బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీయేతర శక్తులతో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం తప్పని సరని అన్నారు. కమ్యూనిస్టుల ఎజెండా ఎప్పుడూ మారలేదని, మారబోదని పువ్వాడ స్పష్టం చేశారు. ఐక్యపోరాటాలే ఎజెండాగా ముందుకు సాగాలన్నారు. సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంత రావు మాట్లాడుతూ దేశం సంక్లిష్ట స్థితిలో ఉందని, ప్రస్తుత పరిస్థితులలో కమ్యూనిస్టుపార్టీ మరో చారిత్రాత్మక పోరాటాలకు సిద్ధమవుతుందని, అందుకు కార్యకర్తలు సిద్ధంకావాలని పిలుపు నిచ్చారు. ఈసభలో సిపిఐ జిల్లా సహాయకార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మెన్ మహ్మద్ మౌలానా, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి, యర్రాబాబు, ఎస్.కె. జానిమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్ధినేని కర్ణ కుమార్, ఎ.ఐ.వై.ఎస్ నాయకులు నానబాల రామకృష్ణ, ఎస్ఎఫ్. నాయకులు పడుపల్లి లక్ష్మణ్, ఇటికాల రామకృష్ణ పాల్గొన్నారు.