Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గు రంగం ప్రవేటీకరణ-పర్మినెంట్ -కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై చర్చ
- భవిష్యత్తు ఐక్య పోరాటాలకు రూపకల్పన
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెంలో ఈ నెల 28, 29 తేదీలలో కొత్తగూడెంలో సీఐటీయూ అనుబంధ ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ సమావేశాలు జరగనున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ సభ్యులు బి.మధు తెలిపారు. మంగళవారం కొత్తగూడెంలో సమావేశ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, 9 బొగ్గు కంపెనీల నుండి వంద మంది బొగ్గు పరిశ్రమలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న అగ్ర నాయకులు ఈ సమావేశాలలో పాల్గొంటారని తెలిపారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న బొగ్గు రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టబోయే పోరాటాల గురించి, 11వ వేతన ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి వ్యతిరేకంగా చేపట్టబోయే దశల వారి పోరాటాల గురించి, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారని తెలిపారు. 2023 సంవత్సరంలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టబోయే భవిష్యత్తు పోరాటాలను ఈ సమావేశంలో ప్రణాళికను రూపొందిస్తారని ఆయన తెలిపారు. అత్యంత ముఖ్యమైన ఈ సమావేశాలలో ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాసుదేవ ఆచార్య, డీడీ రామానందన్, జేబీసీసీిఐ సభ్యులు సుజిత్ భట్టాచార్య, బేగ్, మందా నరసింహారావు, మానస ముఖర్జీ, అర్పీసింగ్, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టి.రాజారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశాలను కొత్తగూడెం స్టేడియం గ్రౌండ్ ఎదురుగా ఉన్న పిఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశాల విజయవంతానికి కార్యకర్తలు అందరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో సీఐటీయూ నాయకులు గాజుల రాజారావు, విజయగిరి శ్రీనివాస్, వై.వెంకటేశ్వరరావు, యర్రగాని కృష్ణయ్య, కొత్తపల్లి రమేష్ బాబు, గడల నరసింహారావు, సూరం ఐలయ్య, కర్ల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.