Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 26.94 కోట్లు నిధులు మంజూరు
జీవోను విడుదల చేసిన పురపాలకశాఖ
- కేటీఆర్, సీఎస్(మున్సిపల్) అరవింద్‌కుమార్‌కు
కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సండ్ర, ఎంపీ వద్దిరాజు
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణ అభివృద్ధి ఇక పరుగులు పెట్టనుంది. సత్తుపల్లి అభివృద్ధికి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ రూ. 30 కోట్లు ఇస్తామంటూ ఇంతకు ముందు హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హైదరాబాద్ వెళ్లిన ప్రతిసారీ ఆ నిధులు కోసం కేటీఆర్‌ను, ఆ శాఖ సీఎస్ అరవింద్ కుమార్‌ను పదేపదే అడుగుతుండటంతో ఎట్టకేలకు గతంలో విడుదల చేసిన రూ. 3.6కోట్లు మినహాయించి మిగతా 26.94 కోట్ల విడుదలకు సంబంధించి మంగళవారం ఆ శాఖ జీవోను విడుదల చేసింది. సత్తుపల్లి పట్టణ అభివృద్ధికి ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరుపై జీవోను ఇవ్వడంపై ఎమ్మెల్యే సండ్ర ఎంపీ వద్దిరాజుతో కలిసి మంత్రి కేటీఆర్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను హైదరాబాద్‌లోని వారి కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సత్తుపల్లి అభివృద్ధి కోసం నిధులు మంజూర వడంపై మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, పాలకవర్గ సభ్యులు మంత్రి, సీఎస్‌కు ధన్యవాదాలు తెలిపారు.
రూ. 26.94కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు
మున్సిపల్‌శాఖ విడుదల చేసిన రూ. 26.94 కోట్లతో సత్తుపల్లి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అంబేద్కర్ ఆడిటోరియం కమ్ లైబ్రరీ నిర్మాణం కోసం రూ. 2.65 కోట్లు, గాంధీనగర్ కమ్యూనిటీహాలు కోసం రూ. 30లక్షలు, వివేకానంద సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌కు రూ. 30లక్షలు, మోడ్రన్ లాండ్రీ మార్ట్ (దోబీఘాట్) కోసం రూ. 70లక్షలు, పట్టణంలోని ప్రధాన రహదారి ఫుట్‌పాత్‌లపై రెయిలింగ్ ఏర్పాటుకు రూ. 85లక్షలు, ప్రధాన రహదారిపై ఎల్ఈడీ వీధిలైట్ల ఏర్పాటుకు రూ. 1.0 కోట్లు, డంపింగ్ యార్డు అభివృద్ధికి రూ. 70లక్షలు, అధిక వర్షాల వల్ల డ్రైనేజీలు పొంగిపొర్లకుండా ప్రత్యేక ఏర్పాట్లతో డ్రైనేజీ నిర్మాణానికి రూ.3.19కోట్లు, దుకాణ సముదాయాల నిర్మాణాలకు రూ.2కోట్లు, బీటీ రోడ్లు ఏర్పాటుకు రూ. 1.50 కోట్లు, 23 వార్డుల పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు రూ. 8.75 కోట్లు, షాదీఖానా భవన నిర్మాణం కోసం రూ. 2కోట్లు, తామర చెరువు, పార్కు అభివృద్ధితో పాటు వేశ్యకాంతల చెరువు కట్టను మినీట్యాంక్ బండ్ ఏర్పాటుకు రూ.3కోట్లు చొప్పున నిధులు కేటాయించి ఆయా అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఎస్టీమేట్ల నివేదికను సంబంధిత మున్సిపల్‌శాఖ నుంచి ఆమోదింపచేశారు.