Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజాగా నాలుగో సారి పెనుబల్లి మండలం ముత్తగూడెం నర్సరీలో
- పెనుబల్లి పోలీసులకు డివిజినల్ మేనేజర్ బాలక్రిష్ణ ఫిర్యాదు
- దొరకని దొంగలు...వైఫల్యం పోలీసులదా...టీఎస్ ఆయిల్ఫెడ్దా..!
నవతెలంగాణ-దమ్మపేట
టీఎస్ ఆయిల్‌ఫెడ్ పామాయిల్ మొక్కల నర్సరీల్లో పామాయిల్ మొక్కల దొంగతనాలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా నాల్గవ సారి ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని ముత్తగూడెంలోని నర్సరీలో నుంచి పామాయిల్ మొక్కలను వాహనాల్లో లోడు చేయబోతుండగా పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనికి ముందు తొలుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం నర్సరీ నుంచి ఐదు వందల మొక్కలు చోరి జరిగింది. చోరి జరిగిన మొక్కలను గుర్తించిన రైతుల బహిర్గతం చేయడంతో అశ్వారావుపేట పోలీసులకు డివిజినల్ మేనేజర్ ఆకుల బాలక్రిష్ణ ఫిర్యాదుతో 06 సెప్టెబంర్ 2021న ఎఫ్ఐఆర్ నమోదయింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత మొక్కలకు ఫుల్ కాస్ట్‌ను పోలీసుల ప్రమేయం లేకుండానే టీఎస్ ఆయిల్‌ఫెడ్ వసూల్ చేసి రసీదు ఇచ్చి దొంగతనం కథకు ఆయిల్‌ఫెడ్ యాజమాన్యమే శుభం కార్డు వేసింది. రెండవ సారి ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం నుంచి పొరుగు తెలుగు రాష్ట్రంలోని ఏలూరు జిల్లా, చింతలపూడి మండలంలోని పోతునూరులో రాయతీ మొక్కలు ప్రత్యక్షమయ్యాయని రైతుల చొరవతో ప్రత్రికలు 13 నవంబర్ 2022న వెలుగులోకి తెచ్చాయి. ఈ సంఘటనపై విచారణ జరిపామని, ఆయిల్‌ఫెడ్ మొక్కలు పోలేదని సత్తుపల్లిలో జరిగిన విలేకర్ల సమావేశంలో స్వయంగా టీఎస్ ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణారెడ్డి క్లీన్ చిట్ ఇచ్చేయడంతో కథ ముగిసింది. ముచ్చటిగా మూడో సారి డిసెంబర్ 2022లో జనగాం నర్సరీ నుంచి ఖమ్మం జిల్లా, వేంసూరు మండలానికి వేళ్లాల్సిన మొక్కలు ఆంధ్రాలోని జంగారెడ్డిగూడెం ప్రాంతానికి లారీలో రవాణా చేస్తుండగా రైతులు సదురు లారీని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దొంగతనం జనగాం నర్సరీలో జరిగినందున జనగాంలోనే టీఎస్ ఆయిల్‌ఫెడ్ అధికారి ఫిర్యాదు చేయడంతో మొక్కల లారీని జనగాం పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే కారణమని వారిపై చర్యలు తీసుకుని చేతులు దులుపు కున్నట్టు సమాచారం. తాజాగా ముత్తగూడెం ఘటనలో ఆంధ్రాకు చెందిన ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నామని, మరికొంత మందితో పాటు సెక్యూరిటీ విదులు నిర్వహిస్తున్న వ్యక్తి పారిపోయాడని, వీరితో పాటు మరికొంత మంది సిబ్బందిపై అనుమానం వున్నట్లు ఫిర్యాదులో ఖమ్మం డివిజినల్ మేనేజర్ ఆకుల బాలక్రిష్ణ పేర్కొన్నారు. వరుసగా నర్సరీల నుంచి మొక్కల దొంగతనాలు సాగుతున్నా సమగ్ర విచారణ నిర్వహించి బాద్యులను గుర్తించకపోవడంపై రైతుల్లో అనుమానాలు నెలకొన్నాయి.
ఫ్యాక్టరీ మేనేజర్ ఆకుల బాలక్రిష్ణకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల డివిజన్ల బాధ్యతలు భారం
అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ ఆకుల బాలక్రిష్ణకు అదనంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల డివిజన్ల మేనేజర్ బాద్యతలు వున్నాయి. వీటి నిర్వహణ పని భారం అధికంగా వుండటంతో విధి నిర్వహణలో కేంద్రీకరణ కష్టంగా మారినందునే ఇటువంటి సంఘటనలు జరగుతున్నాయా అన్న కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దొంగతనాలపై ఆడిట్ లేకుండా రైతులపై ఆడిట్...!
నర్సరీల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రతి నర్సరీలో సుమారు రెండు లక్షల మొక్కలను పెంచుతున్నారు. దొంగతనాలు గుర్తించిన తరువాతైనా మొక్కలను లెక్కించిన దాఖలాలు లేవని రైతులు అంటున్నారు. టీఎస్ ఆయిల్‌ఫెడ్ యాజమాన్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రమే పామాయిల్ మొక్కలు నాటుకున్న రైతుల జాబితాతో క్షేత్ర స్థాయిలో సామాజిక తనిఖీ చేయించారు. ఉద్యానవన అధికారులు, వ్యవసాయ వాఖ విస్తరణ అధికారులు రైతులు మొక్కలు నాటుకున్నట్లు మొక్కలు నాటుకున్నట్లు ధృవీకరించారు. అయినా రైతులను అక్రమార్కులుగా గుర్తించాల్నదే టీఎస్ ఆయిల్‌ఫెడ్ యాజమాన్యం లక్ష్యమా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక తనిఖీలు
దీనిపై ఆకుల బాలక్రిష్ణను మాట్లాడుతూ అశ్వారావుపేటలో మొక్కలకు ఫుల్ కాస్ట్ వసూళ్లు చేసాము. పోతునూరులో మొక్కలు మనవి కాదు. జనగాం ఘటనలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసాము. పెనుబల్లి విషయంపై స్పందిస్తూ మొక్కలు పోలేదని, పోలీసులకు పిర్యాదు చేసామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక తనిఖీ జరిగిందన్నారు.
- ఆకుల బాలక్రిష్ణ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం డివిజన్ల మేనేజర్