Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలతో కునారిల్లుతున్న ఆ నాలుగు పంచాయతీలు
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు సబ్ డివిజన్లో పినపాక, మణుగూరు సరిహద్దుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం అనేక విభేదాల మధ్య పూర్తయింది. సుమారు ఏడేండ్ల కాలంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఈ కాలంలో ప్రాజెక్టు ప్రభావిత గ్రామపంచాయతీలో సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసేందుకు జెన్కో రూ.6 కోట్లకు పైగా సీఎస్ఆర్ నిధులు మంజూరు చేసింది. కానీ ఎక్కడా స్థానిక గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులకు ఖర్చు చేయలేదు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ప్రభావిత గ్రామపంచాయతీలు ధమ్మక్కపేట, సాంబయి గూడెం, సీతారాంపురం, పోతిరెడ్డిపల్లిలలో ఎక్కడా నిధులు కేటాయించినట్లు దాఖలాలు లేవు. ఆ నిధులను దారి మళ్లించి వేరే ప్రాంతాల్లో అభివృద్ధి ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్రామపంచాయతీలలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రహదారులు ప్రధానమైనవి ఇవి కాకుండా ఈ పంచాయతీలలో విపరీతమైన ధ్వని, వాయు కాలుష్యాలు వెదజల్లబడుతున్నాయి. దీని కారణంగా ప్రజలు అస్వాస్థత గురవుతున్నారు. ఈ ప్రాంతాలలో విపరీతంగా మొక్కలు పెంచి కాలుష్యం నివారించాలి, కానీ దాని సంబంధించిన అభివృద్ధి పనులు ఎక్కడ జరగలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు ఆ నిధులను దారి మళ్ళించారని ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ స్వలాభల కోసం మణుగూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కులాలకు కమ్యూనిటీ హాల్స్, మణుగూరులోని వివిధ ప్రాంతాల్లో సెంట్రల్ లైటింగ్‌కు మణుగూరు నుంచి జానంపేట వరకు స్ట్రీట్ లైటింగ్ అభివృద్ధి చేస్తున్నట్టు సమాచారం. ప్రభావిత గ్రామపంచాయతీలో సీఎస్ఆర్ నిధులు ఖర్చు పెట్టకపోగా ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని స్థానిక పంచాయతీల సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, యాష్ పాండ్ వద్ద విపరీతమైన ధ్వనుల కారణంగా ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీటీపీఎస్ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి జీవన ఉపాధి లేకుండా పోయింది. పోడు భూములను ఫారెస్ట్ అధికారులు లాక్కోవడం వలన ఉపాధి పనులు లేక ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్లలో ఉపాధి అవకాశాలు కల్పించాలని, 4 గ్రామపంచాయతీ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకే ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక శాసన సభ్యులు రేగా కాంతారావు చొరవతో ప్రభావిత గ్రామపంచాయతీలకు రూ.50 లక్షలు చొప్పున అభివృద్ధి పనులకు కేటాయించాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై కలెక్టర్, ప్రభుత్వ విప్ రేగా కాంతరావును తమ సమస్యలు తెలిపేందుకు సీఎస్ఆర్ నిధులు తమ గ్రామ పంచాయతీలకు కేటాయించేందుకు కలుస్తామని సర్పంచులు తెలిపారు. సీఎస్ఆర్ నిధులు ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలకు మాత్రమే ఖర్చు చేయాలని ఇతర ప్రాంతాలకు తరలించరాదని, ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నారు.