Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగర్ జలాల సరఫరాలో వారాబంది ఎత్తివేయాలి
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని
నవతెలంగాణ-ఖమ్మం
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక చర్యలు మానుకొని చట్టబద్ధమైన గిట్టుబాటు ధర కల్పించాలని, డిల్లీ సరిహద్దుల్లో 13 నెలల పాటు కొనసాగిన రైతు ఉద్యమం విరమణ సందర్భంగా నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చాకి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో జనవరి 26న రైతు సంఘాలు వ్యవసాయ కూలీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే రైతు మహా ర్యాలీలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. ఖమ్మం సుందరయ్య భవన్లో తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు మాదినేని రమేష్ అధ్యక్షతన జరిగిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశంలో సుదర్శన్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించటం, రైతులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయటం, విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంట్ నుంచి ఉపసంహరించుకోవడం, గిట్టుబాటు ధరలకు చట్టబద్ధత కల్పించడం, స్వామినాథన్ కమిటీ సిఫార్సు నమోదు చేయటం, వ్రాతపూర్వకంగా ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయడం లేదని అన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా జనవరి 26న జిల్లా కేంద్రంలో జరిగే మహా ర్యాలీలో రైతులందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ గడిచిన వానాకాలం సీజన్లో అధిక వర్షాలు తెగుళ్లు సోకి పత్తి మిర్చి పంట దారుణంగా దెబ్బతిన్నాయని, పత్తి, మిర్చి పంటలు పీకేసీ రైతులు వేసంగి సీజన్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారని, వరి పంట రెండో పంటగా సాగు అవుతుందని సాగర్ జలాలు సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన వారాబంది పద్ధతిని ఎత్తివేసి సాగర్ ఆయకట్టు చివర సాగు భూములకు సాగునీటినందించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యం నివారించాలని, గన్నీ సంచులు కొరత లేకుండా జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చి నష్టంపై సర్వే జరిపి రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరరావు, తాత భాస్కరరావు, వాసిరెడ్డి ప్రసాద్, సహాయ కార్యదర్శలు చింతనిప్పు చలపతిరావు, ఎస్కే మీరా, దుగ్గి కృష్ణ, శీలం పకీరమ్మ, రచ్చా నరసింహారావు, బిక్కసాని గంగాధర్ జిల్లా కమిటీ సభ్యులు మల్లెంపాటి రామారావు, తుళ్లూరు రమేష్, సుదర్శన్ రెడ్డి, వనమా చిన్న సత్యనారాయణ, వెంకట్ రెడ్డి, రమేష్, కుటుంబరావు ,ఉమా, తోటకూర వెంకట నరసయ్య శీలం సత్యనారాయణ రెడ్డి, వజా రామారావు, కొల్లేటి ఉపేందర్, రాజు, మంద సైదులు, కూచిపూడి మధు పాల్గొన్నారు.