Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వి.పి. గౌతమ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వనరులు ఉండి, అధిక ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీల అభివృద్ధికి కార్యాచరణ చేసి అమలు చేయాలన్నారు. జిల్లాలో వనరులు, ఆదాయం గల ఖమ్మంరూరల్ మండలం పెద్దతండా, ఏదులాపురం, పోలేపల్లి, గుర్రాలపాడు, కూసుమంచి మండలం పాలేరు, కామేపల్లి మండలం కొమ్మినేపల్లి, కల్లూరు మండలం కల్లూరు గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ఆదాయం, అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీల్లో ఆదాయం, ప్రాధాన్యత క్రమంగా ఏయే పనులు చేపట్టాలి, చేపట్టే పనులు త్వరితగతిన పూర్తికి కార్యాచరణ చేయాలన్నారు. పనుల ప్రతిపాదనలు, టెండర్ ప్రక్రియ, నాణ్యతతో పనుల పూర్తిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి ఉండాలన్నారు. మునిసిపాలిటీలకు దీటుగా అభివృద్ధి చెందాలన్నారు. 2022-23 సంవత్సరంలో ఈ 7 గ్రామ పంచాయతీల్లో 222 పనులు చేపట్టి, 174 పనులు పూర్తి చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేపట్టి పూర్తిచేసిన పనులు, కొత్తగా చేపట్టబోయే పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పురోగతిలో ఉన్న పనులు వెంటనే పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, జెడ్పి సిఇఓ వివి.అప్పారావు, పీఆర్ వికె.శ్రీనివాస్, డివిజనల్ పంచాయతీ అధికారులు ఆర్.పుల్లారావు, వి.ప్రభాకరరావు, ఎంపిడివోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.