Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లె వైపు కన్నెత్తి చూడని పాలకులు
- ప్రభుత్వ పథకాలు వర్తించని నిర్లక్ష్యం
- నమ్ముకున్న భూతల్లి నుంచి దూరం చేసే కుట్ర
నవతెలంగాణ-వైరా
ఉద్యమాల చైతన్య ఖిల్లా ఖమ్మం జిల్లాలో బతుకు దెరువు కోసం పెనుగులాడుతున్న ఆదివాసీ, లంబాడా బిడ్డలపై పాలకుల కక్ష పూరితమా..! నిర్లక్ష్యమా..! ఏదైతేనేం దున్నుకునే నేలతల్లికి కూడా దూరం చేసే కుట్ర నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరా నియోజకవర్గంలో గిరిజన ఏజెన్సీ కారేపల్లి మండలం అటవీ ప్రాంతంలో శివారు గ్రామం రంగు రాళ్ల బోడు. 50 సంవత్సరాల క్రితం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, తండాల నుంచి సామూహికంగా భూమి తల్లిని నమ్ముకుని గుట్టల మధ్య నిర్మించుకున్న చిన్న ఊరు. ఇక్కడ గిరిజనులతో పాటు మైనార్టీ తరగతికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. వీళ్ళని ప్రతి సంవత్సరం పోడు భూములు సాగు చేయవద్దని పాలకులు, అధికారులు ఆటంకాలు కల్పిస్తున్నారు. మీకు ఇక్కడ ఇళ్లు మంజూరు చేయమని ప్రజా ప్రతినిధులే తిరకాసు పెడుతూ వాళ్ల జీవన విధానంపై దెబ్బతీయాలనే తీరు చూస్తే చాలా బాధ కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించినట్లు చెప్పుకుంటున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇక్కడి పేదలకు ఇవ్వాలని ఆలోచన చేసిన దాఖలాలు లేవు. గ్రామస్తులను నాగరిక సమాజానికి దూరంగా ఉంచే ప్రయత్నమే సాగుతోంది. పక్కా ఇళ్లు, ప్రభుత్వ పథకాలు అమలు చేస్తే, వారికి సామాజిక జ్ఞానం వస్తే సమస్యలపై ప్రశ్నిస్తారనే భయంతో పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది అభివృద్ధి నిరోధక చర్య. మౌలిక వసతులు కల్పించకుండా, ఇళ్లు లేకుండా, భూమిపై హక్కు కల్పించకుండా, విద్యా వైద్యానికి దూరం చేస్తూ, పాలకులు కాలయాపన చేయటాన్ని గ్రామస్థులు తెలుసుకున్నారు. మమ్మల్ని మోసం చేస్తూ మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మా పల్లె వైపు చూడట్లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అన్ని సమస్యలకు పరిష్కారం చూపేది మేమే, మార్గ దర్శకులం మేమే అని చెప్పిన వాళ్లు కనీసం కన్నెత్తి చూడటం లేదని అంటున్నారు. ఐటిడిఏ, రెవెన్యూ అధికారులు గ్రామాన్ని సందర్శించరు. గ్రామ అవసరాలను గుర్తించే ప్రయత్నం చేయరు.
ప్రభుత్వం చేయాల్సిన కనీస పనులు
- తక్షణం గిరిజన, మైనార్టీ పేదలకు పక్కాఇళ్ళ నిర్మాణం చేపట్టాలి.
- సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పట్టాలివ్వాలి.
- ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు అందించాలి. గ్రామానికి ఇతర గ్రామాలతో
రవాణ సౌకర్యం కల్పించాలి.
- విద్యా వైద్యం అందుబాటులో తేవాలి.
- సంక్షేమ పథకాలను తమకు కూడా అందించి జనజీవన స్రవంతిలో కలిపేందుకు కృషి జరగాలి
- ప్రతి వారం వైద్య శిబిరం నిర్వహించాలి.
- రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ల తో గ్రామస్థులు ప్రభుత్వం పై పోరుకు సైరన్ మోగించే ప్రయత్నాలు చేస్తున్నారు.