Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
ధాన్యం సేకరణ సొమ్ములు చెల్లింపుల్లో రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందు వరుసలో ఉందని జిల్లా సహకార అధికారి(డీసీఓ) ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రత్యేక తనిఖీల కార్యక్రమంలో భాగంగా సిఈఓ నర్మదతో శుక్రవారం అశ్వారావుపేట, దమ్మపేట, నారాయణపురం సహకార సంఘాలను తనిఖీలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి నెలా మొదటివారంలో జిల్లాలో కనీసం అయిదు సంఘాలను సమగ్ర తనిఖీ చేసి, నివేదికను 10వ తేదీ లోపు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 124 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని 1,48,850 మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం కాగా ఇప్పటివరకూ 54,610 టన్నుల ధాన్యం సేకరించామన్నారు. జిల్లాలో 23 బ్రాంచీల నుంచి సహకార మిత్ర పథకం ద్వారా రూ.100 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రబీలో రూ.70 కోట్ల రుణ పంపిణీ లక్ష్యం కాగా ఇప్పటివరకూ రూ.10 కోట్లు ఇచ్చామన్నారు. మిగిలిన సొమ్ములు మార్చి ఆఖరు నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ములకలపల్లి సహకార సంఘంలో జరిగిన అవకతవకలపై అడగ్గా సెక్షన్ 51 ప్రకారం విచారణ పూర్తి అయ్యిందని సెక్షన్ 60 కింద విచారణ జరుపుతున్నాం అన్నారు. అక్కడ రూ.32.38 లక్షలు, 84.90 లక్షలు రెండు పద్దుల కింద అవకతవకలు జరిగినట్లు తేలిందన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అశ్వారావుపేట పీ.ఏ.సీ.ఎస్ అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, బ్యాంకు మేనేజర్ అనూష, మరో మేనేజర్ వి.కృష్ణ, స్థానిక సీఈఓ మానేపల్లి విజరు ఉన్నారు.