Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శరీరమంతా రక్త స్రవాలతో గాయాలు
- తీవ్రతరమైతే మృతి చెందే ప్రమాదం....?
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణంలో మూగజీవాలు ఒకరకం అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాయి. శరీరం అంత గాయాలు, రక్తం కారుతుండడంతో చూసేవారికి బాధగా కనిపిస్తుంది. తెల్ల పశువుల్లో ఇది కనిపిస్తుంది. 'లంబీ' వ్యాధి గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో అధికంగా వచ్చిందని, దీని వలన పశువులు ఆహారం తినకుండా నిరసించి చనిపోయే ప్రమాదం ఉందని కొత్తగూడెంలో నివాసం ఉంటున్న ఆయా రాజస్థాన్ ప్రాంత వాసులు అంటున్నారు. కొత్తగూడెం పట్టణంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఆవుల్లో ఈ వ్యాధి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. మూగజీవాల బాధను గమనించిన పట్టణంలో వ్యాపారాలు చేస్తున్న రాజస్థానీ వాసులు ఆవులకు సంభవించిన వ్యాధి నివారణకు మందు పిచికారి చేస్తున్నామని హనుమాన్ ప్రజాపతి, ఓంసింసగ్రాజ్ పురోహిత్ తెలిపారు. స్పందించిన వారు వ్యాధితో బాధపడుతున్న పశువులను గుర్తించి మెడిసిన్ స్ప్రే చేస్తున్నారు. కొన్ని పశువులను పశువుల ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కొన్ని పశువులకు శరీరభాగంలో గాయలై రసి కారుతుంది. వాటిపై మందును స్ప్రే చేస్తున్నారు. ఈ వ్యాధి సంక్రమించినప్పుడు వ్యాధి శరీరం మొత్తం వ్యాపించి రంధ్రాలు ఏర్పడుతుందని కొన్ని కొన్ని గాయాలు పెద్దగా మారి రక్తం కారుతూ జీవాలను ఇబ్బందులకు గురిచేస్తుందని వారు తెలిపారు. దీని వలన ఆహారం తీసుకోకుండా పశువు నీరసించి చనిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. ముఖ్యంగా రోడ్ల పైన తిరుగాడే తెల్ల పశువులకు ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో శ్రర్ద తీసుకొని పశువైద్య సేవలు అందిస్తే పశువులకు వ్యాధి తగ్గే అవకాశం ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే పశువుల పెంపకం దారుల పశువులకు సక్రమించి పెద్దఎత్తున పశువులు మరణించే ప్రమాదం ఉందని తెలుస్తుంది. ఈ విషయంలో పశువైద్యాధికారులు స్పందించాలని మూగ జీవాల ప్రేమికులు కోరుతున్నారు.