Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైద్రాబాద్ నుంచి ఖమ్మం వస్తుండగా చెట్టును ఢకొట్టిన కారు
- స్పాట్లో ముగ్గురు మృతి
-మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి
నవతెలంగాణ-ఖమ్మం
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలంలో యరసానిగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం నగరంలోని ఖిల్లా బజార్‌కు చెందిన మహ్మద్ ఇమాద్ (21), షేక్ సమీర్ (21), షేక్ యాసిన్(18), అర్షద్ అలీ, షేక్ కరీమ్, షేక్ సల్మాన్, మహ్మద్ అత్తూర్, షేక్ ఆరీఫ్, మహ్మద్ సోహైల్ అందరూ స్నేహితులు, బందువులు. వీరంతా ఒకే వీధిలో నివసిస్తున్నారు. సమీర్, ఇమ్దద్, యాసిన్ టైల్స్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చెల్లి వలీమా వేడుక హైదరాబాదులోని మోయినాబాద్లో జరుగుతుండగా, శనివారం హాజరై అర్ధరాత్రి సమయంలో ఇన్నోవా వాహనంలో తిరిగి వస్తుండగా కట్టంగూర్ మండలం యరసానిగూడెం గ్రామ సమీపంలోని నేషనల్ హైవే కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో మహ్మద్ ఇమాద్ (21), షేక్ సమీర్ (21), షేక్ యాసిన్(18) అక్కడికక్కడే మరణించారు. ముగ్గురికి తీవ్ర గాయాలు, ముగ్గురికి స్వల్ప గాయాలు కావడంతో నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు.
మహ్మద్ ఇమాద్, షేక్ సమీర్, షేక్ యాసిన్లు ముగ్గురు ఒకే వీధిలో కుటుంబాలతో అద్దెకు నివాసముంటున్నారు. ఇమాద్ తండ్రి మరణించడంతో కుటుంబానికి పెద్దదిక్కయ్యాడు. పదో తరగతి వరకు చదివి కుటుంబ భారం మీద పడటంతో చదువును వదిలేసి టైల్స్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సమీర్ తండ్రి ఆరోగ్యం సరిగా లేకపోవడం, అన్నకు పెళ్లై వేరు కాపురం పెట్టడంతో కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తన పై పడింది. యాసిన్ పేద కుటుంబానికి చెందిన వాడే కావడంతో ముగ్గురు టైల్స్ పని చేసేవారు. ప్రతి రోజూ స్నేహితులు అందరూ కలిసి పనులకు వెళ్లి వచ్చి సాయంత్రం వేళ వీధిలో అందరినీ పలకరిస్తూ సంతోషంగా గడిపేవారు. స్నేహితుడి చెల్లి వివాహ విందు కావడంతో కారులో వెళ్లి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ వార్త తెలియడంతో ఖిల్లా బజార్లో విషాదఛాయలు అలుముకున్నాయి. నిత్యం తమతో సరదాగా మాట్లాడుతూ ఉండే పిల్లలు మరణించారనే వార్తను చుట్టుపక్కల వారు జీర్ణించుకోలేకపోయారు. ఇక చేతికి అందివచ్చిన కొడుకును మృత్యువు కబళించడంతో ఆ కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. తమను చూసుకుంటారనుకున్న కొడుకులు తమ ముందే అనంతలోకాలకు వెళ్లిపోవడంతో వారి రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. మృతుల కుటుంబాలను మంత్రి పువ్వాడ అజరుకుమార్ పరామర్శించి ఓదార్చారు.