Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13,14న హైదరాబాదులో జరుగనున్న టీఎస్ యూటీఎఫ్ 5వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి-..
- టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని, అసిస్టెంట్ ప్రొఫెసర్ రావెళ్ళ లక్ష్మీకాంతం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఆదర్శ మహిళా, స్త్రీ జనోద్ధరణ కోసం విశేషంగా కృషి చేసిన భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ రావెళ్ళ లక్ష్మీకాంతం, టీయస్ యూటీయఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని డిమాండ్ చేశారు. స్థానిక యూటిఎఫ్ కార్యాలయంలో ఆదివారం జిల్లా ఉపాధ్యక్షులు షమి అధ్యక్షతన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల అభినందన కార్యక్రమంలో వారు మాట్లాడారు. డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ రావెళ్ళ లక్ష్మీకాంతం సావిత్రిబాయి పూలే చిత్ర పటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈనెల 13 ,14 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలో జరిగే తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఐదో రాష్ట్ర మహాసభలను విజయ వంతం చేయాలని కోరుతూ గోడపత్రికలను, చీరలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ మహాసభలను కేరళ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ టీచర్ ప్రారంభిస్తారని , ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరవుతారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ,ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి తదితరులు పాల్గొంటారన్నారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని టీఎస్ యుటిఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవీ నాగమల్లేశ్వరరావు , పారుపల్లి నాగేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, షేక్ రంజాన్ ,సురేష్, నాగేశ్వరరావు, రాందాస్, సతీష్, రోజా, లక్ష్మీ కుమారి ,లక్ష్మి ,నర్మద, విజయలక్ష్మి ,మంగీలాల్, నరసింహారావు, రమణ, నవీన్ కుమార్ ,సతీష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.