Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'జిల్లా యంత్రాంగానికి కనుచూపు కందని సుదూరం.. ఏజెన్సీలో విద్యా వ్యవస్థ పై పర్యవేక్షణ లేకపోవడం... సెలవులు పెంచుకుంటున్న కొంతమంది టీచర్లు.... నామమాత్రంగా కొనసాగుతున్న నోట్ క్యాంమ్... నానాటికి నీరుగారుతున్న గిరిజన విద్య.... బయోమెట్రిక్ ఉపయోగంతోనే విద్యా సమస్యలు నివృత్తి అంటున్న విద్యా విశ్లేషకులు... మారని మండల విద్యా వ్యవస్థ పై నవ తెలంగాణ ప్రత్యేక కథనం''
- వెంటాడుతున్న సమయపాలన,పర్యవేక్షణ లోపం
- ఏకోపాధ్యాయ పాఠశాలలతో దిగజారుతున్న గిరిజన విద్య
- బయోమెట్రిక్ ఉపయోగంతోనే విద్యా సమస్యలు నివృత్తి
నవతెలంగాణ-చర్ల
దేశాభివృద్ధికి పల్లెటూరులే పట్టు కొమ్మలని మరచిన కొంతమంది ఉపాధ్యాయుల వలన మండలంలోని ఆదివాసి గ్రామాలలో విద్యా సమస్యలు మర్రి ఊడల వలె పెరిగి రోజురోజుకీ ఏజెన్సీ విద్యా సమస్యలు క్రమేపి పెరగడం మినహా తగ్గటం లేదని కొందరు విద్యా వేత్తలు వాపోతున్నారు. గత ఏడాది ఏజెన్సీ విద్యా వ్యవస్థ పై వచ్చిన వరుస కథనాలకు అధికార యంత్రాంగం చేపట్టిన నామమాత్ర చర్యల వలన కొంతమంది ఉపాధ్యాయులు ఇప్పటికీ మొండి వైఖరి వీడకుండా సమయపాలన పాటించక నిరుపేద గిరిజన విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఘాటైన విమర్శలు లేకపోలేదు.
వెంటాడుతున్న సమయపాలన, పర్యవేక్షణ లోపం
మండల వ్యాప్తంగా కొంతమంది ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం వలన గిరిజన ప్రాంతాల చిన్నారుల భవితవ్యం అగమ్య గోచరంగా ఉందని పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు. ఐదవ తరగతి చదివే విద్యార్థి సైతం కనీసం తెలుగు అక్షరాలు గుర్తుపట్టలేనంత దీనస్థితిలో అటవీ ప్రాంతాలలో విద్య గోచరించిందంటే ఆదివాసి చిన్నారులకు జరిగే అన్యాయం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కదా...మండల వ్యాప్తంగా ఉన్న 72 ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత, ప్రభుత్వ కేజీబీవీ జిల్లా పరిషత్ పాఠశాలలో సుమారు 4500 మంది విద్యార్థులు విద్యాభ్యాసన చేస్తున్నారు. అయితే ఈ గణాంకాలు చెప్పుకోవడానికి మాత్రం చాలా భేషుగా ఉన్నప్పటికిని కొంతమంది ఉపాధ్యాయుల అలసత్వం వలన ఉన్నత విద్య చదివే విద్యార్థులకు సైతం కనీసం కూడికలు, తీసివేతలు రాని దీనమైన దుస్థితి నెలకొని ఉందని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఉదయం 9 గంటల వరకు పాఠశాలకు హాజరై ప్రతిజ్ఞ చేయించాల్సిన ఉపాధ్యాయులే 10:30 నుండి 11 గంటల వరకు పాఠశాలలకు చేరుకోకుండా అలసత్వం వహించడం వలన ఏజెన్సీ విద్యా వ్యవస్థ నానాటికి కృంగిపోతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే ఉపాధ్యాయులలో అలసత్వానికి వారిని పర్యవేక్షించాల్సిన మండల విద్యాశాఖ అధికారి సక్రమంగా పర్యవేక్షించకపోవడం వలన ఇటువంటి ఇబ్బందికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు తల్లిదండ్రులు తమ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యాకో ఉపాధ్యాయ పాఠశాలలతో దిగజారుతున్న గిరిజన విద్య
మండల వ్యాప్తంగా సుమారు 20 యాకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా విద్యార్థుల సంఖ్య నామాత్రంగా, బాధ్య తగల ఉపాధ్యాయులు ఉన్నచోట ఇదే సక్రమంగా ఉన్నప్ప టికిని చాలాచోట్ల ఉపాధ్యాయులసత్వం, సమయపాలన పాటించకపోవడం వంటి ప్రధాన సమస్యలతో గిరిజన విద్య అందని ద్రాక్షగా మిగిలిందని గిరిజన విద్యార్థుల పాలిట అది శాపంగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు. చిన్నారులకు క్రమశిక్షణతో పాటు చక్కటి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే క్రమశిక్షణారహితంగా వ్యవహరిస్తున్నారని పలువురు మంది పడుతున్నారు.
నామమాత్రంగా కొనసాగుతున్న నోట్ క్యాంమ్
గత కొన్ని ఏళ్లుగా పర్యవేక్షణ లోపంతో మండల వ్యాప్తంగా కుంటుపడుతున్న విద్యా వ్యవస్థపై నవతెలంగాణలో వచ్చిన వరుస కథనాలకు విద్యాధికారులు నోట్ క్యాం విధానాన్ని ప్రవేశపెట్టగా మండల వ్యాప్తంగా ఉన్న ఐదు కాంప్లెక్స్‌లకు గాను కేవలం ఒకటో రెండో కాంప్లెక్స్ మినహా మిగతా కాంప్లెక్స్‌లో నోట్ క్యాంమ్ విధానం అమలు కావడం లేదని ఆయా కాంప్లెక్స్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ గిరిజన విద్యార్థుల భవితవ్యంతో ఆడుకుంటున్నారనే వాదనలు లేకపోలేదు. అయితే ఐటీడీఏ పరిధిలో ఉన్న పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు రొటేషన్ పద్దతిలో విధులకు హాజరవుతూ చిన్నారుల చదువులకు ఆటంకం కల్పిస్తున్నారని విమర్శలు కోకోలలు.
బయోమెట్రిక్ ఉపయోగంతోనే విద్యాసంస్థలు నివృత్తి
సరిహద్దు ములుగు జిల్లాలో ఏర్పాటు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా బయోమెట్రిక్ విధానాన్ని ఉప యోగించి విద్యా సమస్యలను నివృత్తి చేసుకోవచ్చని విద్యావే త్తలు సూచిస్తున్నారు. బయోమెట్రిక్ వలన సమయపాలన పాటించని ఉపాధ్యాయులకు చెక్కు పడుతుందని, తద్వారా గిరిజన విద్య గణనీయంగా మార్పు వస్తుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఏజెన్సీ విద్యపై ఉన్నతాధికారుల దృష్టి సారించాలి : జోగయ్య ఎర్రంపాడు గ్రామ యువకుడు
ఆదివాసి గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు విధులు సక్రమంగా నిర్వహించడం లేదు. ఉన్నతాధికారులు దృష్టి సారించి ఏజెన్సీ విద్యను మెరుగుపరచాలి. కలెక్టర్, పీఓలు గిరిజన విద్య పై శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాం.
ఉపాధ్యాయుల పనితీరు, నోట్ క్యాంపై సమీక్షిస్తాను
ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేసిన నోట్ క్యాం అన్ని కాంప్లెక్స్ ఉపాధ్యాయులు పాటించే విధంగా చర్యలు చేపడతాను. సమయపాలన పాటించని ఉపాధ్యాయుల పై శాఖ పరమైన చర్యలు చేపడతాను.
- జుంకీలాల్ మండల విద్యాశాఖ అధికారి