Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కలెక్టర్‌కు బాధితుల వినతి
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణంలోని మను బోతుల చెరువు కాలనీ వద్ద 2017లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం స్థల సేకరణ చేసే సందర్భంగా ఖాళీ చేయించిన 15 కుటుంబాల వారికి ఇండ్లు కేటాయించాలని బాధితులు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఇక్కడ 35 ఏండ్లుగా నివాసముంటున్న 15 పేద కుటుంబాల వారిని ఆనాటి అధికారులు ఖాళీ చేయించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తి అయ్యాక మీకు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ 15 కుటుంబాల వారు ఆనాటి నుండి అద్దె ఇండ్లలో నివాసం ఉంటూ వేలకు వేలు అద్దెలు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఆనాటి శాసనసభ్యులు సున్నం రాజయ్య, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్డిఓ శ్రీమన్నారాయణ రెడ్డి, తహసీల్దార్ రామకృష్ణ, ఐటీడీఏ ఈఈ, శంకర్రావు సమక్షంలో బాధితులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఉన్నారన్నారు. వారి హామీతో పక్కా ఇండ్లు సైతం తొలగించడానికి అంగీకరించడంతో వాటిని తొలగించి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం ప్రారంభించారు. నేడు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తి కావచ్చిన సందర్భంగా అధికారులకు అనేకమార్లు వినతిపత్రం అందించిన స్పందించకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నామన్నారు. కావున నష్టపో యిన 15 కుటుంబాల వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించిన తర్వాతనే ఇతరులకు కేటా యింపు చేయాలని కలెక్టర్‌కి వినతి పత్రం అందించి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. బాధితులు ఇచ్చిన వినతి పత్రంపై స్పందించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ స్థానిక అధికారులతో విచారణ జరిపించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయింపు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా, పట్టణ కమిటీ సభ్యులు లక్ష్మీకాంత్, బాధితులు హిమాంబి, బంటు వెంకటేశ్వర్లు, బంటు రాణి, సావిత్రి, నాగమణి, సుమంత రాజు, టి.లక్ష్మి, జి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.