Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరంతరాయంగా సాగునీరు సరఫరా చేయాలి
- తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్‌కి వినతి
నవతెలంగాణ-ఖమ్మం
సాగర్ జలాలు సరఫరాలో వారాబంధి సడలించి నిరంతరాయంగా సాగునీరు అందించాలని వైరా రిజర్వాయర్ నుంచి ఆయకట్టు సాగునీరు సరఫరాపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతులు సోమవారం గ్రీవెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో వేల ఎకరాల్లో యాసంగి వరి పంట నాట్లు వేయటం జరుగుతుంది అని, మరోవైపు వానాకాలం సీజన్లో అధిక వర్షాలు వల్లన దెబ్బ తిన్న పత్తి, తెగుళ్లు సోకి మిర్చి పంట తొలిగించి రెండవ పంటగా మొక్కజొన్న వేస్తున్నారని, సాగర్ ఆయకట్టులో మిర్చి ఇతర పంటలు కూడా సాగులో ఉన్నాయి అన్నారు. వారబంది ద్వారా సాగర్ జలాలు సరఫరా వల్ల, వరినాట్లకు, మొక్కజొన్న పంటకు ఏకకాలంలో సాగు నీరు అవసరం ఏర్పడిందని, మధ్యలో వారం, పది రోజుల సాగు నీరు సరఫరా నిలుపుదల చేయడం వల్ల సాగర్ ఆయకట్టు చివర భూములకు సాగునీరు అందటం లేదని, వారం గ్యాపు రావడం తొలి దశలో ఉన్న పంట దెబ్బ తినే అవకాశం ఉందని వారబంది సడలించి నిరంతరాయంగా సాగునీరు అందించాలని కోరారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు నీటి సరఫరాపై అధికారులు స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ స్నేహలత ఇరిగేషన్ అధికారులతో వెంటనే సంప్రదించి రైతులకు సాగునీరు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, ఉపాధ్యక్షులు తాతా భాస్కరరావు, వాసిరెడ్డి ప్రసాద్, ఎస్కే మీరా, బోనకల్ మాజీ ఎంపిపి తూళ్ళూరి రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తాళ్ళపల్లి కృష్ణ, తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెరకుమల్లి కుటుంబరావు, శీలం సత్యనారాయణ రెడ్డి, కుసుపూడి మధు, తూము చంద్రరావు, రైతులు పాల్గొన్నారు.