Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరాటౌన్
వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అమరజీవి కామ్రేడ్ కాజా రాధాకృష్ణమూర్తి 16వ వర్ధంతి సభను వైరా మున్సిపాలిటీ పరిధిలోని గండగలపాడు గ్రామంలో సిపిఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి గుమ్మా నరసింహారావు అధ్యక్షతన ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వాసిరెడ్డి విద్యాసాగర్ రావు కాజా రాధాకృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు. వైరా నియోజకవర్గం ఇన్చార్జి భూక్యా వీరభద్రం కాజా రాధాకృష్ణమూర్తి స్థూపం వద్ద పార్టీ జెండాను ఎగురవేశారు. ''కామ్రేడ్ కాజా రాధాకృష్ణమూర్తి జీవిత చరిత్ర'' పుస్తకాన్ని వారి శిష్యుడు, మధు విద్యాసంస్థల చైర్మన్ మల్లంపాటి వీరభద్రరావు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన వర్ధంతి సభలో మల్లెంపాటి వీరభద్రరావు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కాజా కొరియర్గా, బోడేపూడి వెంకటేశ్వరావు అనుచరుడిగా పని చేశారని కొనియాడారు. ఈ వర్థంతి సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం మాట్లాడుతూ కాజా నిబద్ధత, గొప్పతనాన్ని, గురించి కమ్యూనిస్టు పార్టీ విలువలను, నేటి సామాజిక పరిస్థితులను, ముంచుకొస్తున్న మతోన్మాదం ప్రమాదాన్ని వివరించారు. కార్యక్రమంలో సిపిఐ (ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు మల్లెంపాటి రామారావు, మచ్చా మణి, హరి వెంకటేశ్వరరావు, పుచ్చకాయల కృష్ణ, పుచ్చకాయల రామయ్య, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, ఇమ్మడి సుధీర్, ఇమ్మడి వీరభద్రం, దేవబత్తిని నరసింహారావు, వాసిరెడ్డి రమేష్, కిన్నెర మోతి, బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.