Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు
- వంద ఎకరాలలో 5 లక్షల మందితో సభకు కసరత్తు
- సీఎం కేసీఆర్‌తో సహా ఇతర సీఎంలు, మాజీ సీఎంలకు ఆహ్వానం
- ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్
- తుమ్మల కేసీఆర్, కేటీఆర్‌లను కలవడంపై ఆసక్తి
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్ఎస్ జిల్లా ముఖ్య నాయకులు పలువురు పార్టీలు మారుతున్నారని ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఖమ్మంలో నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి పార్టీ 'తొలికేక' బహిరంగ సభను ఢిల్లీలో నిర్వహించాలని పార్టీ అధిష్టానం తొలుత భావించింది. కానీ ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఖమ్మం నుంచే తొలికేకను వినిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 18న సీఎం కేసీఆర్ ఖమ్మం రానున్నారు. ఇందుకోసం పార్టీ, అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆరోజు వీవీ పాలెం వద్ద నూతన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొం టారు. ఈ బహిరంగ సభ జిల్లా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు సోమవారం హైదరాబాదులో జిల్లా ముఖ్య నేతలతో సమావేశమ య్యారు. సుమారు మూడు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో బహిరంగ సభకు సంబంధించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించినట్లు తెలిపారు. 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించే భారీ బహిరంగసభకు ఐదు లక్షల మందిని తరలించాల్సిందిగా పార్టీ నాయకులకు సీఎం సూచించారు. ముఖ్య నేతల మార్పుతో జిల్లాలో చోటు చేసుకునే రాజకీయ పరిణామాల ప్రభావం పార్టీపై ఉండకుండా ఇప్పటినుంచే నష్టనివారణ చర్యలు చేపట్టాలని ముఖ్య నేతలకు సీఎం సూచించినట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలకు హాజరైన జిల్లా ముఖ్య నాయకులు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకొని సీఎంతో భేటీ అయ్యారు.
తుమ్మల హాజరుపై ఆసక్తి
సీఎంతో భేటికి ఉమ్మడి జిల్లా ఎంఎల్ఏలందరూ హాజరుకాగా కొత్తగూడెం ఎంఎల్ఏ వనమా వెంకటేశ్వరరావు గైర్హాజరయ్యారు. మరోవైపు పార్టీ మారుతాడనే ఊహాగానాల నేపథ్యంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్, కేటీఆర్‌లను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటిలో మంత్రి పువ్వాడ అజరుకుమార్, ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్సీలు తాతా మధు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంఎల్ఏలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియ, రాములునాయక్, రేగా కాంతారావు, మెచ్చ నాగేశ్వరరావు, జెడ్పీ చైర్మెన్ లింగాల కమల్‌రాజు తదితరులు హాజరయ్యారు.
తొలికేకకు పలువురు సీఎంలకు ఆహ్వానం
బిఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత ఖమ్మంలో నిర్వహించే తొలికేకకు ఖమ్మం గుమ్మంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. రైతు అభ్యున్నతే నాదంగా.. జై కిసాన్ నినాదంగా ... జాతీయ జెండా ఎత్తిన బీఆర్ఎస్ ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మరో ముగ్గురు ముఖ్యమంత్రులు కేజ్రీవాల్ (ఢిల్లీ), భగవంత్‌మాన్ (పంజాబ్), విజయన్ (కేరళ) హాజరు కానున్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా ఈ సభకు వస్తారు. వీరిలో ఎవరు వస్తారు ఎవరు హాజరు కాలేరు అనే విషయంపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో తన ప్రస్థానం మొదలు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగానే సంక్రాంతి తర్వాత ధూమ్‌ధామ్ మొదలు కానున్నది. రైతు, రాజకీయ చైతన్య గడ్డ ఖమ్మంలో ఈ నెల 18న భారీ బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ శంఖారావం పూరించనున్నది.
భారీగా సభకు సన్నాహాలు...
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే. తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి బలమైన అండగా నిలిచిన బహిరంగ సభల మాదిరిగానే బీఆర్ఎస్ కూడా సభల ద్వారానే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని అధిష్ఠానం భావిస్తున్నది. పార్టీ సత్తా చాటేలా ఈ సభను నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.ఈ సభకు 3 లక్షల మంది భారీ జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు. సభను 100 ఎకరాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ కటౌట్లుతో నేతలకు ఘన స్వాగతం పలకనున్నారు. ఆ ఏర్పాట్లను మంత్రి పువ్వాడ పీఏ రవికిరణ్‌తో కలిసి అడిషనల్ సీపీ బోస్, ఏసీపీ బస్వారెడ్డి, ఆర్అండ్బి ఈఈ శ్యామ్ ప్రసాద్ సోమవారం పరిశీలించారు.